ద్రవ్యోల్బణం సవాలే: రాజన్, ల్యాంకోకు ఊరట

ప్రతి సమీక్షా సమావేశంలో నిర్ణయాలకు అనుగుణంగా తనను అంచనా వేయొద్దని ఓ టీవి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. కాగా ఇటీవల ద్రవ్యపరపతి సమీక్షలో వడ్డీరేట్లను ఆర్‌బిఐ పెంచకపోవడంతో ఆర్‌బిఐ వ్యూహంలో మార్పు వచ్చినట్టుగా అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే మరికొన్ని కీలకమైన గణాంక వివరాలు వెలువడితే తప్ప వడ్డీ రేట్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోరాదన్న అభిప్రాయంతోనే ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగిస్తున్నట్టు రాజన్ వివరించారు.
ద్రవ్యోల్బణం, పారిశ్రామిక వృద్ది రేటుకు సంబంధించిన తాజా గణాంకాల కోసం చూస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ డేటా వస్తే తప్ప ఇప్పటి వరకు తాము తీసుకున్న చర్యల ప్రభావం ఏ విధంగా ఉందో బోధపడదని ఆయన అన్నారు. దాన్ని బట్టి తదుపరి చర్యలుంటాయని అన్నారు.
ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరసగా రెండు సమావేశాల్లో రెపోరేటును 0.25 శాతం చొప్పున పెంచుతూ వచ్చిన రాజన్, ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో మాత్రం రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇది ఇలా ఉండగా నిర్దేశిత గడువు జనవరి నాటికి కొత్త బ్యాంకు లైసెన్సులను జారీ చేయలేకపోవచ్చని రాజన్ అన్నారు. అయితే మరీ ఎక్కువగా సమయం పట్టకపోవచ్చని ఆయన తెలిపారు.
రుణాల పునర్‌వ్యవస్థీకరణతో ల్యాంకోకు ఊరట
న్యూఢిల్లీ : మౌలిక వసతులు, విద్యుత్, నిర్మాణ రంగంలో దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు 7000 కోట్ల రూపాయల విలువైన రుణాల పునర్‌వ్యవస్థీకరణకు ఆమోదం లభించింది. రుణభారం, నిధుల లేమితో సతమతమవుతున్న ల్యాంకోకు ఇది అతిపెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.
ఈ కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ (సిడిఆర్) స్కీమ్ కింద కంపెనీకి రూ. 2,500 కోట్ల ప్రియార్టీ రుణాలు కూడా అప్పులిచ్చిన ఆర్థిక సంస్థల నుంచి లభిస్తాయి. ప్రియార్టీ రుణాల వల్ల ఇపిసి (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) కార్యకలాపాలు మెరుగుపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications