నల్లధనంపై సర్వే: టాప్ 10లో భారత్

నివేదిక ప్రకారం నల్లధనం ఎగుమతిదారుల జాబితాలో చైనా 1.08 ట్రిలియన్ డాలర్ల నల్లధన ఎగుమతులతో అగ్రస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 880.96 బిలియన్ డాలర్లతో రష్యా, 461.86 బిలియన్ డాలర్లతో మెక్సికో, 370.38 బిలియన్ డాలర్లతో మలేషియా ఉన్నాయి. సంవత్సరాల వారీగా చూస్తే 2011లో భారత్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉందని, ఈ ఒక్క సంవత్సరంలోనే భారత్ నుంచి దాదాపు 84.93 బిలియన్ డాలర్ల నల్ల ధనం ఎగుమతి అయిందని ఆ నివేదిక పేర్కొంది.
నేరాలు, అవినీతి, పన్నుల ఎగవేత తదితర అక్రమాల ద్వారా వర్థమాన దేశాల నుంచి నల్లధన ప్రవాహం రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. 2010లో వర్థమాన దేశాల నుంచి ఈవిధంగా 832.4 బిలియన్ డాలర్ల నల్ల ధనం తరలిపోగా, 2011లో అది 13.7 శాతం పెరిగి 946.7 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఈ నివేదిక పేర్కొంది. వర్థమాన దేశాల నుంచి 2002-11 మధ్య కాలంలో మొత్తం 5.9 ట్రిలియన్ డాలర్ల నల్ల ధనం తరలిపోయినట్టు ఈ నివేదిక నిగ్గు తేల్చింది. నల్లధన ఎగుమతి దారుల జాబితాలో తొలి 15 స్థానాల్లో నిలిచిన దేశాల్లో ఆరు దేశాలు (చైనా, మలేషియా, భారత్, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్) ఆసియా ఖండానికి చెందినవి కావడం గమనార్హం.
ఆఫ్రికా ఖండానికి చెందిన దేశాలు రెండు (నైజీరియా, దక్షిణాఫ్రికా), యూరప్ ఖండానికి చెందిన దేశాలు నాలుగు (రష్యా, బెలారస్, పోలెండ్, సెర్బియా), పశ్చిమ ప్రాంత దేశాలు రెండు (మెక్సికో, బ్రెజిల్), ‘మెనా' ప్రాంతానికి చెందిన ఒక దేశం (ఇరాక్) ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ నివేదికను వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న జిఎఫ్‌ఐ (గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ) అనే సంస్థ బుధవారం ప్రచురించింది. ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతుండగా మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ప్రతి ఏటా భారీ మొత్తంలో నల్ల ధనాన్ని తరలిస్తున్నాయని జిఎఫ్‌ఐ అధ్యక్షుడు రేమండ్ బాకర్ తెలిపారు.


Click it and Unblock the Notifications