భారత్ సురక్షితం: చిదంబరం, టిసిఎస్‌లో జాబ్స్

P Chidambaram
సింగపూర్/బెంగళూరు: భారత మౌలిక సదుపాయాల రంగం, మూలధన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి తరలిరావాలని భారత ఆర్థికమంత్రి విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు పిలుపునిచ్చారు. 8 శాతం వృద్ధి రేటు సామర్థ్యం గల భారత్ పెట్టుబడులకు సురక్షితమైన దేశమని ఆయన పేర్కొన్నారు. గురువారం సింగపూర్‌లో జరిగిన రెండో దక్షిణాసియా దేశాల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. భారత్‌లో స్థూల ఆర్థిక మూలాధారాలు, సూక్ష్మ ఆర్థిక మూలాధారాలు పటిష్ఠంగా ఉన్నాయని, అందువల్ల భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన, సురక్షితమైన ప్రదేశమని పేర్కొన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరమైన వేగంతో ముందుకు తీసుకుపోవడానికి, పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసాన్ని పాదుగొల్పడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. దేశంలో ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, మౌలిక సౌకర్యాల అభివృద్ధి ఫండ్స్ ఉన్నాయని, వీటితో పాటు పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కింద తమ ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను ఇవ్వగలమని చిదంబరం పేర్కొన్నారు.

చమురు, గ్యాస్ రంగాల్లో అనేక ప్రాజెక్టులు వ్యూహాత్మక పెట్టుబడిదారులకు స్వాగతం పలుకనున్నాయని, త్వరలో ఒక ప్రభుత్వ రంగ ఇటిఎఫ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా పెట్టుబడిదారులు యూనిట్లను కొనుగోలు చేయవచ్చని అని చిదంబరం పేర్కొన్నారు. 1991-2011 మధ్య కాలంలో 20 ఏళ్ల పాటు ఎనిమిది శాతం, అంతకన్నా ఎక్కువ శాతం వృద్ధి రేటు సాధించిన సామర్థ్యం గల దేశం భారత్ అని, ఈ కాలంలో దేశ సగటు వృద్ధి రేటు ఏడు శాతం నమోదయిందని చిదంబరం వివరించారు.

ఫిబ్రవరి నాటికి 25వేల నియామకాలు:టిసిఎస్

బెంగళూరు: 2014 ఫిబ్రవరి నాటికి 25వేల మందికి ప్రాంగణ(క్యాంపస్) నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) వెల్లడించింది. తాము ఏడో సెమిస్టర్ నుంచే ట్రైనీ లేదా ప్రాంగణ నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపింది. ట్రైనీలుగా చేరే వారికి వేతన స్థాయి ఏడాదికి రూ. 3.15 నుంచి రూ. 3.25 లక్షలుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ఇప్పటికైతే 25వేల మందిని నియమించుకునే ప్రక్రియలో ఉన్నట్లు టిసిఎస్, ఈవిపి, గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ అజయ్ ముఖర్జీ గురువారం వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి కల్లా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50వేల మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.

పిఎస్‌యూలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలి: ప్రధాని

న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ(పిఎస్‌యూ)లు మరింత పోటీతత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు అధికార నియంత్రణ నుంచి విముక్తి కల్పించడంతో పాటు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పించి వాటిని సమర్ధవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, అయితే ప్రైవేటు రంగ సంస్థల నుంచి పోటీకి గురికాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో గురువారం జరిగిన ‘బ్రిక్స్' అంతర్జాతీయ పోటీ సదస్సులో ప్రసంగించిన ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగం నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడేలా ప్రభుత్వ రంగ సంస్థల్లో పోటీతత్వాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, ఇందుకు దోహదపడే విధానాలను మన ప్రభుత్వాలు అనుసరించాలని సదస్సులో పాల్గొన్న ‘బ్రిక్స్' (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల అధికారులకు సూచించారు. ప్రైవేటు రంగాన్ని ధీటుగా ఎదుర్కొనేలా ప్రభుత్వ రంగ సంస్థల పోటీతత్వానికి పదును పెట్టాలంటే వాటికి ఆయాచితంగా ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వాలు తమ శాసన, ఆర్థిక అధికారాలను ఉపయోగించ కూడదని మన్మోహన్ పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+