
దేశాన్ని వృద్ధిపథంలో నడిపించాలంటే మరిన్ని చర్యలు అవసరమని మయారామ్ అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరం 2012-13లో జిడిపి 5 శాతంగా నమోదై దశాబ్దకాలం కనిష్టానికి దిగజారిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం గతవారం అంచనా వేశారు. అయితే ఈ క్రమంలో మయారాం 2008 నాటి మాంద్యం ప్రభావం ఇంకా దేశంపై ఉందని పేర్కొనడం చిదంబరం అంచనాకు అద్దం పడుతున్నాయి.
కాగా, విద్యుత్, వ్యవసాయం, విద్యా, ఔషధ రంగాలతోపాటు రైల్వేలు ఇప్పటికీ ఒడిదుడుకుల్లోనే ఉన్నాయని మయారాం తెలిపారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆత్మరక్షణలోపడ్డ అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ వస్తువులు, సేవల నుంచి ఎదురయ్యే పోటీ వాతావరణాన్ని తట్టుకుని దేశీయ పారిశ్రామిక, వ్యాపార రంగాలు నిలబడేలా కొన్ని చట్టాలను తెచ్చాయని ఆయన అన్నారు. ఫలితంగా ఆయా దేశాల ఎగుమతులపై ప్రభావం పడుతుతోందని తెలిపారు.
అయితే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలంటే మార్కెట్లలోని ఆంక్షలు తొలిగించాల్సిన అవసరం ఉందన్నారు. కరెంట్ ఖాతా లోటును కట్టడి చేసి, వృద్ధిరేటు మరింతగా నమోదుచేస్తామనే విశ్వాసాన్ని మయారామ్ విదేశీ మదుపర్లలో కలిగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
నేడు మహిళా బ్యాంకు ప్రారంభం
న్యూఢిల్లీ: మహిళల కోసం ఉద్దేశించిన భారతీయ మహిళా బ్యాంకు (బిఎంబి) మంగళవారం ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని ఇందిర జయంతి సందర్భంగా ముంబైలో ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా ఈ బ్యాంకు మంగళవారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూపిఎ చైర్‌పర్సన్ సోనియా, ఆర్థిక మంత్రి చిదంబరం హాజరుకానున్నారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రారంభ వేడుకను ముంబైకి మార్చారు.
ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఢిల్లీలో నెలకొల్పారు. బడ్జెట్‌లో ఈ బ్యాంకుకు 1,000 కోట్ల రూపాయల ప్రారంభ మూలధనాన్ని కేటాయించారు. దేశ వ్యాప్తంగా ఏడు శాఖలు మంగళవారం నుంచి సేవలనందించనున్నాయి. 2014 మార్చి నాటికి శాఖలను 25కు పెంచాలని బ్యాంకు నిర్ణయించింది.


Click it and Unblock the Notifications