మొండి బకాయిలు: బ్యాంకులపై ప్రతికూల ప్రభావం

మొండి బకాయిలను వసూలు చేసేలా తగిన ఏర్పాటు సిద్ధం చేసుకోవాలని కూడా సూచించారు. కోటి రూపాయలకుపైగా ఉన్న మొండి బకాయిల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వీటిని వసూలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ కూడా రంగంలోకి దిగుతుందన్న సంకేతాలనిచ్చారు. మొత్తానికి మొండి బకాయిలు బ్యాంకింగ్ రంగం అభివృద్ధిని అడ్డుకుంటూ గుదిబండలా తయారయ్యాయి.
కాగా మొండి బకాయిల జాబితాలో తొలి 30 స్థానాల్లో ఉన్న వాటి విలువ దేశంలోని మొత్తం ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల విలువలో మూడింటా ఒక వంతుగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల జాబితాలో తొలి 30 స్థానాల్లో ఉన్న మొండి బకాయిలు ఈ ఏడాది జూన్ ఆఖరుకల్లా 63,671 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
అదే సమయంలో మొత్తం దేశంలోని 26 ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని మొండి బకాయిల విలువ 1,82,829 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఆ 30 మొండి బకాయిల విలువ ఇందులో 34.83 శాతంగా నమోదైంది. జాతీయ బ్యాంకులపరంగా చూస్తే 19 జాతీయ బ్యాంకుల మొండి బకాయిల విలువ 1,11,209 కోట్ల రూపాయలుగా ఉంటే, ఇందులో తొలి 30 మొండి బకాయిల విలువ 48,406 కోట్ల రూపాయలుగా ఉంది.
జాతీయ బ్యాంకుల మొండి బకాయిల్లో ఇది 43.5 శాతంగా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్ ముగింపునాటికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, దాని అనుబంధ సంస్థల్లోని మొండి బకాయిల విలువ 71,620 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఎస్‌బిఐ మొండి బకాయిల జాబితాలో తొలి 30 మొండి బకాయిలు 15,266 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఎస్‌బిఐ మొండి బకాయిల్లో 21.3 శాతమని రిజర్వు బ్యాంక్ పేర్కొంది.


Click it and Unblock the Notifications