
ఆర్థిక వ్యవస్థలో మందగమ నం కొనసాగుతున్నప్పటికీ ధరల అదుపునకే ఆర్‌బిఐ మొగ్గుచూపించటం గమనార్హం. అయితే విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రఘురామ్ రాజన్ రేట్లను పెంచారు. స్వల్ప కాలిక వడ్డీ రేటు (రెపో రేటు)ను 0.25 శాతం పెంచి 7.75 శాతానికి చేర్చారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ( ఎంఎస్ఎఫ్ ) రేటును 0.25 శాతం తగ్గించి 8.75 శాతానికి చేర్చారు.
నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్ఆర్) లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే రివర్స్ రెపో రేటును 6.5 శాతం నుంచి 6.75 శాతానికి పెంచారు. డాలర్ మారకంలో రూపాయి పతనం నేపథ్యంలో తీసుకున్న కొన్ని ప్రత్యేక చర్యల్లో భాగంగా ఎంఎస్ఎఫ్ రేటును పెంచారు. ఈ చర్యలను ఉపసంహరిస్తామని చెప్పిన రాజన్ అందుకు అనుగుణంగా ఎంఎస్ఎఫ్ రేటును తగ్గించారు. మ్యూచువల్ ఫండ్స్ నగదు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ బ్యాంకుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ విండోను కూడా ఆర్‌బిఐ రద్దు చేసింది.
ఆర్‌బిఐ తాజా విధానంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు లాభపడి 61.31 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 359 పాయింట్ల లాభంతో మూడేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఇప్పటికే పలు బ్యాంకులు గృహ, వాహన, కన్జూమర్ రుణాలపై కన్సెషన్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుండటంతో రేట్ల పెంపు జనవరి వరకు వాయిదా పడే అవకాశాలున్నాయి. అయితే బ్యాంకులకు మాత్రం నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది. రెండు నెలల వ్యవధిలోనే రెపో రేటును రెండు సార్లు ఆర్‌బిఐ పెంచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ది రేటును 5.5 శాతం నుంచి 5 శాతానికి ఆర్‌బిఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను ఆర్‌బిఐ తగ్గించడం ఇది రెండోసారి. కొత్త బ్యాంకుల లైసెన్సులపై జలాన్ కమిటీ నవంబర్ 1న తొలిసారిగా సమావేశమవుతుందని రాజన్ వెల్లడించారు. బాండ్ల కొనుగోళ్లను నిలిపివేయడంపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం ఆలస్యమైన కొద్ది దేశీయ మార్కెట్లలో ఒడిదుడుకులు సర్దుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications