భారత వృద్ధిరేటు 4.7శాతమే: ప్రపంచ బ్యాంకు

ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) కూడా భారత వృద్ధిరేటును 3.75 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 2014-15 ఆర్థిక సంవత్సరానికి మాత్రం భారత వృద్ధిరేటు 5.1శాతం ఉండగలదని ఐఎంఎఫ్ తెలిపింది. రాబోయే సంవత్సరం మాత్రం భారత వృద్ధిరేటు 6.2 శాతం ఉండొచ్చని ప్రపంచబ్యాంకు పేర్కొంది. ఏప్రిల్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 6.1 శాతం కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది 6.7 శాతంగా ఉండగలదని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, అధిక వడ్డీరేట్లు తదితర కారణాల వల్ల వృద్ధిరేటు అంచనాలను తగ్గించినట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 4.4 శాతం వృద్ధి నమోదయిందని, తర్వాత రెండు నెలలు కూడా వృద్ధిరేటు పెరిగేందుకు పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయని, అందువల్ల తాజాగా వృద్ధిరేటు అంచనాలను తగ్గించామని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ముఖ్య ఆర్థిక వేత్త మార్టిన్ రామ తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గు ముఖం పట్టడం, ఎగుమతులు జోరందుకోవడం, రూపాయి బలపడటం, వ్యవసాయరంగంలో 3.4 శాతం వృద్ధి నమోదవచ్చన్న అంచనాలతో ఈ ఏడాది ద్వితీయార్థంలో వృద్ధిరేటు పెరగొచ్చని ఆయన తెలిపారు.
ఈ చివరి త్రైమాసికంలో 6 శాతం వృద్ధి ఉండొచ్చని, మొత్తానికి ఈ సంవత్సరాంతానికి జిడిపి వృద్ధిరేటు 4.7 శాతం ఉంటుందని బ్యాంకు పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 5శాతం ఉండగలదని డిబిఎస్ ఇండియా అంచనా వేస్తోంది. ఆర్థిక వ్యవస్థలోని మందగమన పరిస్థితులు మరి కొంత కాలం కొనసాగే వీలుందని తెలిపింది. వృద్ధిరేటు 3.8 శాతం నుంచి 5శాతం మధ్య ఉండొచ్చని, బహుశా దాదాపు 5శాతం నమోదు కావచ్చని డిబిఎస్ ఇండియా జిఎం, సిఈఓ సంజీవ్ భాసిన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications