
నిజాయితీకి మారుపేరుగా ఉన్న ఈ అధికారి పేరును సీబీఐ నిందితుడిగా పేర్కొనడంపై రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీసీఎల్ఏగా కొనసాగిన పరేఖ్‌కు ఆనాటి ప్రభుత్వం సీఎస్‌గా పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత ఆయన డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. బిజినెస్ రూల్స్ ప్రకారం కలెక్టర్లకు సీసీఎల్ఏగా పనిచేసే సమయంలో పరేఖ్ ఉన్నతాధికారిగా వ్యవహరించేవారు. కలెక్టర్ల ఏసీఆర్‌లన్నీ సీసీఎల్ఏనే రాయాలి.
కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన తర్వాత కూడా పలువురు కలెక్టర్ల ఏసీఆర్‌లు రాయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పరేఖ్‌కు లేఖలు రాసింది. అయితే నిబంధనల ప్రకారం ఏసీఆర్‌లను ఆయనే రాయాలి. కానీ, పరేఖ్ అందుకు తిరస్కరించారు. ఆ కలెక్టర్లు నాకు రిపోర్టు చేయలేదు.. నన్ను కలవలేదు, నానుంచి ఎలాంటి ఉత్తర్వులు తీసుకోలేదు అందువల్ల వారి పనితీరు తనకు ఎలా తెలుస్తుందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనే ఏసీఆర్‌లను రాయించుకుంది.
హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్‌గా పని చేసిన సమయంలో తనకు ముందు కమిషనర్‌గా పని చేసిన అర్జునరావు హయాంలో అక్రమాలు జరిగాయని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని పరేఖ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఆనాటి ఎమ్మెల్యేలంతా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పరేఖ్‌పై వేటు వేసింది. అవినీతి చోటు చేసుకుంటే దాని విచారించాలని కోరడం తప్పా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరో లేఖ రాశారు.
చక్కెర శాఖ కమిషనర్ గా పనిచేసిన సమయంలో ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించగా పరేఖ్ అడ్డుకున్నారు. 2009లో బొగ్గు శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ పరేఖ్ పదవీ విరమణ చేశారు. కాగా ఆయన హయాంలోనే బొగ్గు కుంభకోణం జరగడంతో ఆయనపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అయితే ఇలాంటి నిబద్దత కలిగిన పరేఖ్ అవినీతికి పాల్పడి ఉండరని పలువురు ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కుంభకోణంలో ఆయన పాత్ర ఏమేర ఉందనే విషయాన్ని విచారణలో తేలాల్సి ఉంది. కాగా పీసీ పరేఖ్ మాట్లాడుతూ కుంభకోణంలో తను దోషి అయినట్లయితే ప్రధాని మన్మోహన్ కూడా దోషే అని ఆయన అన్నారు. ప్రధానిపై ఎందుకు చర్యలు తీసుకోరు అని ఆయన ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications