వాషింగ్టన్: తమ వద్ద అవసరమైన విదేశీ మారక నిల్వలున్నాయని, భారత్ ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్ల వరకూ నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)ని ఆశ్రయించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై శుక్రవారం జరిగిన ఒక చర్చలో రఘురాం రాజన్ మాట్లాడారు.
భారత్ ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్నీ ఎదుర్కొవడం లేదని, వచ్చే ఐదేళ్లలో నిధుల విషయంలో ఐఎంఎఫ్‌ను సంప్రదించే అవకాశమే లేదని రఘురాం రాజన్ పేర్కొన్నారు. తన ఆర్థిక అవసరాలను తీర్చుకునే పరిస్థితిలో భారత్ లేదన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. భారత విదేశీ రుణం దేశ జిడిపిలో 22 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం భారత్ వద్ద 28,000 కోట్ల డాలర్ల విదేశీ మారకం నిల్వలున్నాయని, ఇవి జిడిపిలో 15 శాతానికి సమానమని తెలిపారు. మరో విధంగా చెప్పాలంటే విదేశీ నిల్వలు అప్పుల్లో నాలుగింట మూడు భాగాలున్నాయని ఆయన చెప్పారు.

మొత్తం స్వల్పకాలిక విదేశీ రుణాల్లో భారత్ చెల్లించాల్సింది జిడిపిలో పది శాతం ఉంటుందని, ఇందుకు సరిపోయేంతగా నిధులు తమ వద్ద ఉన్నాయన్నారు. గత ఏడాదిలో 60 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశామని, ఇది కరెంట్ ఖాతా లోటులో నాలుగింట మూడు వంతులని తెలిపారు. ఒకవేళ అత్యవసరమనుకుంటే బంగారం రూపంలో చెల్లింపులు చేస్తామన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదించిందని, ఇలాంటి సమయంలో ఉన్న విదేశీ మారకం నిల్వలు వసరాలకు సరిపోతాయని ఆయన పేర్కొన్నారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత వృద్ధి ప్రపంచంలోని కొన్ని దేశాల వృద్ధి రేటుకన్నా చాలా మెరుగ్గా ఉందని రఘురామ్ రాజన్ వివరించారు.


Click it and Unblock the Notifications