
క్రికెట్ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించినా సచిన్ టెండూల్కర్‌తోనే దీర్ఘకాలం అనుబంధం కొనసాగిస్తామని ఆ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అడిడాస్, అవైవా ఇండియా, ఎస్‌ఏఆర్ గ్రూప్, కోకాకోలా, ఫ్యూచర్ గ్రూప్, తోషిబా వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నారు.
అడిడాస్ ఇండియా బ్రాండ్ డెరైక్టర్ తుషార్ గోకుల్‌దాస్ మాట్లాడుతూ.. సచిన్‌తో జీవితకాల అనుబంధం ఉంటుందని తెలిపారు. తను ఆడినా, ఆడకున్నా ఈ అనుబంధంపై ప్రతికూల ప్రభావాలేమీ ఉండవని ఆయన చెప్పారు. సచిన్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. మరో బ్రాండ్ కోకాకోలా ఇండియా ప్రతినిధులు కూడా సచిన్ టెండూల్కర్‌తో తమ అనుబంధాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నాయి.
సచ్ బ్రాండ్ టూత్‌పేస్టులు వంటి ఉత్పత్తులకు సంబంధించి సచిన్ టెండూల్కర్‌తో తమ అనుబంధం ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగుతుందని ఫ్యూచర్ బ్రాండ్స్ ఎండీ, సీఈవో సంతోష్ దేశాయ్ చెప్పారు. ఎండార్స్‌మెంట్ల సంఖ్య కాస్త తగ్గితే తగ్గొచ్చు కానీ.. రిటైరైనా సచిన్ బ్రాండ్ విలువకు ఢోకా ఉండబోదని సంతోష్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.
సచిన్ టెండూల్కర్‌తో తమకు దృఢమైన అనుబంధం ఉందని, తన రిటైర్మెంట్ ప్రకటన తమ బ్రాండ్ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపబోదని, తనతో తమ సంస్థకున్న అనుబంధాన్ని కొనసాగిస్తామని అవైవా ఇండియా డైరెక్టర్(మార్కెటింగ్) రిషి పిపరీయా తెలిపారు. సచిన్ కుదుర్చుకున్న మిగితా బ్రాండ్ల యాజమాన్యాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications