
వచ్చే జనవరి నాటికి లైసెన్స్‌ల ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ బోర్డు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. త్రిసభ్య కమిటీ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత తన సిఫార్సులను గవర్నర్, డిప్యూటీ గవర్నర్‌లకు అందచేస్తుందని చెప్పారు. సిఫార్సుల ఆధారంగా తుది నివేదిక సిద్ధమైన తర్వాత కేంద్ర బోర్డుకు పంపుతామని ఆయన తెలిపారు.
కొత్త బ్యాంక్ లైసెన్స్‌లను పరిశీలిస్తున్న ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా జనవరిలో పదవీ విరమణ చేస్తారు కనుక ఈ లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు రఘురాం రాజన్ తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగాల నుంచి మొత్తం 26 దరఖాస్తులు రాగా.. అందులో టాటా సన్స్‌తోపాటు అనిల్ అంబానీ, కుమార మంగళం బిర్లాల సారథ్యంలోని కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న ఇండియా పోస్ట్, ఐఎఫ్‌సిఐలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆర్‌బిఐ గత 20ఏళ్లలో రెండు దశలుగా ప్రైవేటు రంగంలో 12 బ్యాంకులకు లైసెన్సులను జారీ చేసింది.
5.5% వృద్ధి రేటు సాధ్యమే: రాజన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 5 నుంచి 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. ఖరీఫ్ పంటల దిగుబడి, ఎగుమతులు, మౌలిక పరిశ్రమల పనితీరు మెరుగ్గా ఉండగలదన్న అంచనాల నేపథ్యంలో ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
కీలక రంగాలలో అనుకూల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని అందువల్ల వృద్ధిరేటు 5-5.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రాజన్ తెలిపారు
ఐసిఐసిఐ అకాడమీ ప్రారంభం
జైపూర్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు వీలుగా ‘ఐసిఐసిఐ అకాడమీ'లను శుక్రవారం ప్రారంభించింది. హైదరాబాద్‌తోపాటు జైపూర్, సాంగ్లి, పుణె, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నైలలో ఈ అకాడమీలను ఐసిఐసిఐ బ్యాంకు ఏర్పాటు చేసింది. ఈ అకాడమీలలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన యువతకు వొకేషనల్ శిక్షణను అందిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత వారు స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపట్టవచ్చునని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, చీఫ్ ఎగ్జిక్యుటివ్ చందా కొచ్చర్ తెలిపారు.
ఆమె జైపూర్‌లో ఐసిఐసిఐ అకాడమీని శుక్రవారం ప్రారంభించారు. నిపుణులను తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏర్పాటైన 9 శిక్షణాకేంద్రాలలో తొలి సంవత్సరంలో 5వేల మంది యువతకు శిక్షణ ఇస్తామని ఆమె చెప్పారు. 2016 నాటికి 15000 మందికి శిక్షణ ఇవ్వాలని నిశ్చయించామని తెలిపారు. ఈ కేంద్రంలో గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్లకు వివిధ కోర్సులలో శిక్షణ ఇస్తారు. ఇవి 12 వారాల పాటు ఉంటాయి.


Click it and Unblock the Notifications