వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇప్పుడిపపుడే మందగమనం నుంచి కోలుకుంటున్నామంటూ.. ఉద్దీపనలు ఉపసంహరించే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించిన అమెరికాకు మరో సమస్య ఎదురైంది. అదేమిటంటే.. అమెరికా వార్షిక బడ్జెట్ ఆమోదంపై పార్లమెంట్‌లో తలెత్తిన ప్రతిష్ఠంభన పెను సంక్షోభానికి దారితీసింది. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేత (షట్ డౌన్)తో భారత్ ఎగుమతులు దెబ్బతింటాయని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బడ్జెట్ ఆమోదించడంలో స్తంభన నెలకొనడం కారణంగా ఖర్చులకు డబ్బు లేకపోవడంతో పలు ఫెడరల్ ప్రభుత్వ సంస్థలను పాక్షికంగా మూసివేయాల్సిందిగా (షట్ డౌన్) అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యకలాపాలు(అత్యవసర, నిత్యావసర సేవలు మినహా) నిలిచిపోనున్నాయి. ఒబామా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరోగ్య సర్వీసుల బిల్లుపై డెమొక్రట్లు, రిపబ్లికన్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. సోమవారం రాత్రి వరకు ఉభయ పక్షాల మధ్య రాజీకి విఫల ప్రయత్నాలు జరిగాయి.

బడ్జెట్ ఆమోదానికి రిపబ్లికన్లు దిగిరాకపోవడంతో కాంగ్రెస్ తన విధి నిర్వహించలేకపోయిందని ఒబామా తెలిపారు. బడ్జెట్ ఆమోదంలో విఫలమైన కారణంగా ప్రభుత్వ సంస్థల్లో అత్యధిక భాగం మూసివేయాల్సి వస్తోందని అన్నారు. కాంగ్రెస్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపేవరకు ఈ పరిస్థితి కొనసాగక తప్పదని ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా తీసుకున్న నిర్ణయంతో 8 లక్షల మంది ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల్లేకుండా ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూసివేత కొనసాగినంతకాలం వారు వేతనాల్లేని సెలవులో ఉంటారు. ఈ ప్రభావం భారత ఎగుమతులపై కూడా తప్పక ఉంటుందని పారిశ్రామిక విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత ఎగుమతిదారులను అమెరికా తీసుకున్న నిర్ణయం ఇబ్బందులు పెడుతుందని ఇంజినీరింగ్ ఎగుమతుల సంస్థ ఈఈపీసీ ఇండియా పేర్కొంది. నౌకాశ్రయాలు, కార్గో, నియంత్రణ సంస్థల అనుమతుల ప్రభావంతో సరుకును అక్కడే నిలిపేయాల్సి వస్తుందని చెబుతోంది. అంతేగాక కొనుగోలుదార్లు కొత్త ఆర్డర్లను వాయిదా వేసే అవకాశం ఉందని పేర్కొంది. పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో సర్వీసులకు అంతరాయం కలుగుతుందని దానివల్ల ఎగుమతులు దెబ్బతింటాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అన్నారు. భారత్ ఎగుమతులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సమయంలో అమెరికా షట్ డౌన్ ప్రకటించడంపై ఎగుమతిదారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
కాగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 101.05 డాలర్లకు పడిపోయింది. అయితే అమెరికా షట్ డౌన్ వల్ల భారత ఐటి రంగంపై తక్షణ ప్రభావం ఏమీ ఉండదని నాస్కామ్ వెల్లడించింది. దేశీయ ఐటి రంగం ప్రధానంగా ప్రైవేట్ రంగంపై ఆధారపడి ఉందని, అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఎక్కువగా ఉండవని వెల్లడించింది. భారత వస్తువుల, సేవలను దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసింది.
అమెరికా ఇంతకముందు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. 1976 నుంచి కనీసం 17 సందర్భాల్లో ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. 1996 డిసెంబర్ నుంచి 1997 జనవరి మధ్య 21 రోజుల పాటు షట్‌డౌన్ చేయాల్సి వచ్చింది. షట్‌డౌన్ కారణంగా బిల్ క్లింటన్ ప్రభుత్వంపై 200 కోట్ల డాలర్ల అదనపు భారం పడినట్టుగా విశ్లేషించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications