సగం జాబ్స్ రోబోలు చేస్తాయా?
గత కొన్ని దశాబ్దాలుగా కంప్యూటర్లను అన్నిరంగాల్లో విరివిగా ఉపయోగించడం జరుగుతోంది. పారిశ్రామిక, నిర్వహణ సంస్థల కార్యకలాపాల్లో కంప్యూటర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. కంప్యూటర్ల ప్రవేశంతో మానవ వనరుల అవసరం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం కంప్యూటరీకరణను నియంత్రించడం సాధ్యమయ్యేలా లేదు.
1930లో అట్లాంటిక్ వ్యాప్తంగా మాంద్య పరిస్థితులు అలుముకున్నాయి. సాంకేతిక అభివృద్ధి ద్వారా కొత్తగా ఉద్యోగాలను సృష్టించవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మెనార్డ్ కీన్స్ అభిప్రాయపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా సాంకేతికతతో నిరుద్యోగం పెరిగిపోయింది. అయితే ఇది తాత్కాలికమేనని కీన్స్ పేర్కొన్నారు. దీర్ఘ కాలంలో సాంకేతిక అభివృద్ధి మానవుల ఆర్థిక సమస్యలను తీర్చగలదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కొంతమంది ఆర్థికవేత్తల్లో ఆర్థిక పరిస్థితిపై ఆశావాహ దృక్పథం తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. సాంకేతిక అభివృద్ధి సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా తక్కువ ఆదాయంతోనే సామాన్య ప్రజానీకం ఉత్పత్తి, సేవా రంగాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడవుతోంది.
భద్రతా సిబ్బంది, ఫార్మసీ సిబ్బంది, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్లు, ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ తయారీ కార్మికుల ఆదాయంలో పెరుగుదల తీవ్రంగా మందగించినట్లు వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కంప్యూటర్ సంబంధించిన ఉద్యోగాలైన మేనేజర్స్, ఇంజినీర్స్, కన్సల్టెంట్స్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల నమోదు చేసింది. దీంతో ఆదాయ అసమానతలు తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం బ్రిటన్, అమెరికా దేశాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నట్లు పలు విశ్లేషణలు తెలుపుతున్నాయి.
ప్రస్తుతం నిర్మాణ, అసెంబ్లీ రంగాల్లో కంప్యూటరైజేషన్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలోని సుమారు 700 వృత్తులు కంప్యూటరీకరణ మూలంగా 47శాతం చిన్న రంగాల కార్మికులు అభద్రతాభావంలో ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతిక ఆవిష్కరణలు భిన్నమైన సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు దోహదపడుతన్నాయి. ఈ ఆవిష్కరణలో భాగంగా రోబోలు తయారు చేయబడుతున్నాయి.
రవాణా, లాజిస్టిక్స్ ఉద్యోగాలు కూడా ఇప్పుడు కష్టసాధ్యంగా మారుతున్నాయి. డ్రైవర్ అవసరం లేని కార్లను ఇటీవల గూగుల్ కంపెనీ అభివృద్ధి చేస్తోంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ట్రక్కుల డ్రైవర్ల స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఫార్మసీ రంగంలో కూడా సాంకేతికత ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పవచ్చు.
సుమారు 20శాతం మేర వ్యక్తిగత, కుటుంబ సేవల వినియోగం కోసం రోబోలను మార్కెట్లలో ప్రవేశపెట్టడం జరుగుతోంది. అయితే విద్యా, కళా, ఆరోగ్య రంగాల ఉద్యోగాల్లో మాత్రం సాంకేతిక, కంప్యూటరీకరణ తీవ్రమైన ప్రభావం చూపలేకపోయిందని చెప్పవచ్చు. కంప్యూటరీకరణ అనేది తక్కువ నైపుణ్యం గల కార్మికులపైనే తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే కార్మికులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా అవకావాలను మెరుగుపర్చుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications