
నిరుడు భారత ఆర్థిక రంగం దశాబ్ది కనిష్ఠ స్థాయిలో 5 శాతం వృద్ధిని నమోదు చేయగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మరింత దిగజారి 4.4 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. కాగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.4 శాతం వరకు ఉండవచ్చన్న అంచనాలను ప్రధాని ఆర్థికసలహా మండలి ఇటీవల 5.3 శాతానికి తగ్గించగా ఆర్‌బిఐ కూడా వృద్ధిరేటు అంచనాలను 5.7 శాతం నుంచి 5.5 శాతానికి కుదించింది. కార్పొరేట్ రంగానికి ఉద్దీపనలు ఇస్తే తప్ప ఆర్థిక రంగంలో పురోగమనం అసాధ్యం అన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మయారామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మౌళిక సదుపాయాల రంగంలో రుణ, మూలధన పెట్టుబడులను ప్రోత్సహించేందుకు బాండ్ మార్కెట్‌ను బలోపేతం చేయడంతోపాటు ‘మౌలిక నిధి' ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అరవింద్ మాయారాం తెలిపారు. వచ్చే రెండు, మూడు నెలల్లో మౌళిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులందించడానికి ఈక్విటీ, బాండ్ మార్కెట్లు మరింత బలోపేతం కానున్నాయని మాయారామ్ చెప్పారు.
మౌళిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)ను ప్రోత్సహిస్తోందని, కార్పొరేట్ బాండ్ మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ) తరహాలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ను రెండు నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
భారత కరెన్సీకి గల అంతర్గత బలం కారణంగా డాలర్ మారకంలో రూపాయి విలువ 58-60 మధ్య స్థిరపడే అవకాశం ఉందని మాయారాం అభిప్రాయపడ్డారు. కొనుగోలు శక్తి, వాస్తవ ఆచరణీయ ఎక్స్ఛేంజ్ రేటు (ఆర్ఇఇఆర్) ఆధారంగా రూపాయి విలువ ఈ స్థాయిలో ఉండే అవకాశం ఉందని అన్నారు. రూపాయి ప్రస్తుతం కొంత నిలదొక్కుకుని 62.63 వద్ద ట్రేడవుతోందని తెలిపారు. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపనలను ఉపసంహరించినా పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాయారాం చెప్పారు.


Click it and Unblock the Notifications