
ఉల్లిపాయల ధరలు పెరిగితే రైతులకు మంచిదేగా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఇటీవల విమర్శలు ఎదుర్కొన్నారు. అది మరువక ముందే ఇప్పుడు కపిల్ సిబాల్ ధరల పెరుగుదల ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు.
కాగా, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉల్లి సరఫరా మెరుగ్గా ఉన్నందున కిలో 70 రూపాయలకు చేరిన ఉల్లిపాయల ధరలు వచ్చే నెల మొదటి వారంలో తగ్గవచ్చునని కేంద్ర ఆహార శాఖ మంత్రి కెవి థామస్ మంగళవారం తెలిపారు. ఉల్లిపాయలు ఉత్పత్తి చేస్తున్న మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో నిల్వ చేసేవారిపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కేంద్రం కోరిందని ఆయన చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలలో వర్షాలు కురవడం ఆలస్యం కావడంతో పంట చేతికి రావడానికి జాప్యమైందని, ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు నుంచి ఉల్లిపాయలు మార్కెట్‌లోకి వస్తాయి కనుక ధరలు తగ్గుతాయని వెల్లడించారు.
ఉల్లిపాయల ఎగుమతులపై ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఇపి) టన్నుకు 650 డాలర్లు నిర్దారించడంతో ఎగుమతులు తగ్గాయని, దిగుమతులను అనుమతించినా ఇంతవరకు ఉల్లిపాయలు దేశంలోకి రాలేదని మంత్రి చెప్పారు.


Click it and Unblock the Notifications