
రూపాయి పతనం, ఉద్యోగాల్లో అస్థిరత, అధిక ధరల కారణంగా ఈ ఏడాది పండుగల సీజన్ నిరాశాజనకంగా ఉంటుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేసినప్పటికీ అందుకు కేరళకు మినహాయింపు లభించింది. విదేశాల్లో నివశిస్తున్న తమ బంధుమిత్రులు పంపిన నిధుల కారణంగా కేరళ వాసులు తమ రాష్ట్రంలో పెద్ద పండగ ఓనంను ఘనంగా నిర్వహించుకునే అవకాశం దక్కింది.
కేరళ రాష్ట్రానికి చెందిన వారి నుంచి కేవలం ఆరు నెలల్లో 75,883 కోట్ల రూపాయలు స్వదేశానికి వచ్చాయి. డారల్‌తో రూపాయి క్షీణతను మరింతగా సొమ్ము చేసుకునేందుకు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న దేశాల్లోని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కూడా స్వదేశానికి పంపుతున్నారు. సుమారు 25 లక్షల మంది కేరళ వాసులు విదేశాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర జిడిపిలో వీరు పంపే నిధుల వాటా 35 శాతం ఉంది. నిధుల ప్రవాహం భవిష్యత్ లో కూడా ఇలాగే కొనసాగితే, రాష్ట్ర జిడిపిలో నిధుల వాటా 40 శాతానికి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
కేరళకు చెందిన ప్రవాస భారతీయులలో 40 శాతం మంది యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో, సౌదీ అరేబియాలో 25 శాతం మంది ఉంటున్నారు. విదేశీ నిధుల ప్రవాహంపై సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ విభాగంలోని మైగ్రేషన్ యూనిట్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్క రోజులో కేరళ రాష్ట్రంలోని బ్యాంకులకు చేరుతున్న రెమిటెన్సుల మొత్తం రాష్ట్ర ఆదాయం కంటే 1.6 రెట్లు అధికంగా ఉంది. ఈ మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న ఆదాయం కంటే 6.2 రెట్లు అధికంగా ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications