రాజన్ ఎఫెక్ట్: కోలుకుంటున్న రూపాయి
ముంబై: రూపాయి బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న నూతన రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యలతో రూపాయి గురువారం కొంతమేర కోలుకుంది. బుధవారం వరకు రికార్డు స్థాయిలో పతనమవుతూ వచ్చిన రూపాయి మారకం విలువ 2.3శాతం పెరిగింది. గురువారం డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.65.53గా నమోదైంది.
ఆగస్టు 28న డాలర్ తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో రూ.68.85లకు క్షీణించింది. బుధవారం ఆర్‌బీఐ గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన రఘురాం రాజన్ ప్రసంగంతో గురువారం స్టాక్ మార్కెట్లు కూడా స్వల్ప లాభాల పట్టాయి. రాజన్ వ్యాఖ్యలు మధుపర్లలో కూడా నమ్మకాన్ని కలిగించాయి.

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400పాయింట్లకు పైగా లాభపడగా, 100 పాయింట్లకు పైగా నిఫ్టీ లాభ పడింది. రఘురాం రాజన్ తన ప్రసంగంలో వివిధ అంశాలకు ప్రాధాన్యత కల్పించారు.
తన దగ్గర భారీ ప్యాకేజీ ఉందంటూ ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రకటనతో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు, కొత్త బ్యాంకు లైసెన్సులను వచ్చే ఏడాది జనవరిలో జారీ చేయనున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణంతోపాటు సంఘటిత వృద్ధి, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం కూడా ఆర్‌బీఐ ప్రాథమ్యాలేనని స్పష్టం చేశారు.
బ్యాంకులు కొత్త శాఖలను ప్రారంభించేందుకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అందుకు అవసరమైన సర్క్యులర్ విడుదల చేస్తామని తెలిపారు. మార్కెట్ల నిబంధనలను సరళీకరించేందుకు సెబీతో చర్చిస్తామన్నారు. ప్రాథమికంగా పరిపతి స్థిరత్వాన్ని సరిచూస్తూనే వృద్ధిపై కూడా దృష్టి సారిస్తామని రఘురాం రాజన్ తెలిపారు.


Click it and Unblock the Notifications