మైక్రోసాఫ్ట్ చేతికి నోకియా, ఆపిల్‌కు సవాల్
న్యూయార్క్: నోకియా మొబైల్ ఫోన్ వాణిజ్యాన్ని తాము కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ కార్ప్స్ మంగళవారం ప్రకటించింది. దాని విలువ 5.44 బిలియన్ యూరోలు. లావాదేవీలు ముగిసిన తర్వాత నోకియా సిఇవో స్టీఫెన్ ఎలోప్ మైక్రోసాఫ్ట్‌లో చేరుతారని తెలుస్తోంది.
ఈ డీల్ 2014 మొదటి త్రైమాసికంలో కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇది చేతులు మారడానికి నోకియా వాటాదారులు, నియంత్రణ అమోదాలు కావాల్సి ఉంటుంది. నోకియా మైక్రోసాఫ్ట్‌తో 2011లో జత కట్టింది. తమ మొబైల్ ఫోన్లలో మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్ పనిచేసేలా మైక్రోసాఫ్ట్‌తో అప్పుడు ఒప్పందం చేసుకుంది.

భవిష్యత్తులోకి పయనించడానికి ఇది సాహసోపేతమైన నిర్ణయమని, రెండు సంస్థల ఉద్యోగులకు, వాటాదార్లకు, వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ అవుట్ గోయింగ్ సిఇవో స్టీవ్ బల్మేర్ అన్నారు. ఫోన్లలో మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ వాటాను, లాభాలను పెంచుతుందని అన్నారు. విడిభాగాలు, సేవా రంగాల్లో మైక్రోసాఫ్ట్‌కు, దాని భాగస్వాములకు మొత్తం అవకాశాలను పటిష్టం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఎలోప్‌తో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు లావాదేవీలు పూర్తి కాగానే మైక్రోసాఫ్ట్‌లోకి వెళ్తారని, అయితే వారు అక్కడ ఏ హోదాలో ఉంటారనేది తెలియదని నోకియా ఓ ప్రకటనలో తెలిపింది. నోకియా బోర్డు చైర్మన్ రిస్తో సిలస్మా సిఇవో విధులు చూస్తారని, ఫిన్నిస్ కంపెనీ కొత్త సిఇవోను తీసుకుంటుందని చెప్పారు.
ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా ఒకప్పుడు మొబైల్ ఫోన్ల రంగంలో తిరుగులేని ఆధిపత్యం సాధించింది. అయితే, అపిల్, సామ్‌సంగ్ వంటి సంస్థల స్మార్ట్‌ఫోన్ల నుంచి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కుంటోంది. మైక్రోసాఫ్ట్ దాన్ని తీసుకుంటుండడంతో సామ్‌సంగ్, ఆపిల్ సంస్థలకు గట్టి పోటీ ఏర్పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications