
రుణం తీసుకున్న డబ్బుని విజయ్ మాల్యా చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను ఒపెన్ మార్కెట్లో సుమారు రూ. 100 కోట్ల షేర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. దీంతో విజయ్ మాల్యా ముంబై హైకోర్టును ఆశ్రయించి తక్షణమే తనఖా పెట్టిన షేర్లను విక్రయించరాదని ఆదేశించాలని కోర్టును కోరారు. ఇందుకు అభ్యంతరం చెబుతూ కింగ్‌ఫిషర్ మాతృ సంస్థ విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను జస్టిస్ ఎస్‌జే కట్టావాలా తిరస్కరించారు.
యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌తోపాటు, రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియం తమ వాదనలను బొంబాయి హైకోర్టుకి వినిపించాయి. రుణాల చెల్లింపులో కింగ్‌ఫిషర్ విఫలంకావడంతో ఇప్పటికే తాము తనఖాలో ఉన్న షేర్ల విక్రయాన్ని మొదలుపెట్టినట్లు వాదనలో భాగంగా బ్యాంకులు హైకోర్టుకి తెలిపాయి. దీంతో కింగ్‌ఫిషర్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు సెక్యూరిటీగా తమ తనఖాలో ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునంటూ ముంబై హైకోర్టు స్పష్టం చేసింది.
అత్యధికంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1,800 కోట్ల వరకు రుణాలు ఇచ్చింది. 2012 జనవరి నుంచి రూ. 7,500 కోట్లమేర బకాయిలను కింగ్‌ఫిషర్ చెల్లించకపోవడంతో యూఎస్‌ఎల్ షేర్లను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించాయి. దీనిలో భాగంగానే సెక్యూరిటీగా తనఖా పెట్టిన యూఎస్‌ఎల్, మంగళూర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షేర్లతోపాటు, గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాకు చెందిన గోవా విల్లా, ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌లను విక్రయించేందుకు సిద్దమయ్యాయి.
ఇది ఇలా ఉంటే ఇటీవలే కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన 15 విమానాలను డీరిజిస్టర్ చేసినట్లు పౌరవిమానయాన నియంత్రణ సంస్ద డైరెక్టర్ జనరల్ అరుణ్ మిశ్రా తెలిపారు. దీంతో కింగ్‌ఫిషర్ తమకు అద్దె బకాయిలు చెల్లించనందున ఈ విమానాలను.. కింగ్ ఫిషర్‌కి లీజుకిచ్చిన విదేశీ కంపెనీలు వాటిని వెనక్కి తీసుకెళ్లవచ్చునని అన్నారు. ఆదాయపు పన్ను శాఖతో పాటు ఎయిర్ పోర్టు ఆపరేటర్లకు కూడా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బకాయి పడింది. త్వరలోనే వీటన్నంటిని కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ యాజమాన్యంతో చర్చిస్తామని అరుణ్ మిశ్రా తెలిపారు.
ఇది ఇలా ఉంటే కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీకి చెందిన 10 విమానాలతో పాటు, లీజుకు తీసుకున్న 15 విమానాలను మాత్రం డీరిజిస్టర్ చేయలేదని చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు పైగా రుణాలు, నష్టాల భారంతో ఉంది. తన సర్వీసులను పునరుద్దరించేలా కనబడటం లేదు. కింగ్‌ఫిషర్‌కు చెందిన దేశీయ ఫ్లయింగ్ స్లాట్‌లతో పాటు అంతర్జాతీయ రూట్లలో కూడా స్లాట్‌లను రద్దు చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కింగ్‌ఫిషర్‌కు కేటాయించిన స్లాట్‌లను రద్దు చేయడంతో.. ఈ స్లాట్‌లను వేరే విమానయాన కంపెనీలకు అందుబాటులో ఉంచాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆదేశించింది.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications