
దేశీయ ఎయిర్‌లైన్స్‌లో విదేశీ విమానయాన కంపెనీలకు 49 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తన విధివిధానాలను సడలించడంతో.. దీనికి అనుగుణంగానే ఎఫ్‌ఐపీబీ ఈ కొత్త జేవీకి అనుమతి ఇచ్చింది. ప్రతిపాదిత కొత్త ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ఏషియా 49 శాతం, టాటాసన్స్ 30 శాతం, టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ 21 శాతం పెట్టుబడులు పెట్టి కొత్త ఎయిర్‌లైన్‌ను ప్రారంభిస్తాయని ఎయిర్ ఏషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఏషియా-టాటా జేవీ ఏర్పాటుకు కొన్ని విధానపరమైన సమస్యలు తప్పితే, పెద్ద అడ్డంకులేవీ లేవని పౌరవిమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ పేర్కొన్నారు.
కేబినెట్ నిర్ణయాన్ని వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని అజిత్‌సింగ్ తెలిపారు. ప్రస్తుతమున్న భారతీయ కంపెనీలో పెట్టుబడి పెట్టే విదేశీ ఎయిర్‌లైన్స్‌కే 49 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి అనేది నోటిఫికేషన్‌లో ఉంది. అదేవిధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, మూడోవంతు డెరైక్టర్లుగా భారతీయులకే అవకాశం ఇతరత్రా అంశాలను కొత్త కంపెనీ అమలు చేస్తుందా అనేది మేం పరిశీలిస్తామని అజిత్ సింగ్ అన్నారు. ఇక ఎఫ్‌ఐపీబీ నుంచి క్లియరెన్స్ లభించినందున ఎయిర్ ఏషియా జాయింట్ వెంచర్ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్‌ను (డీజీసీఏ)ను సంప్రదించి ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ సంపాదించాల్సి ఉంటుంది. విమానాల షెడ్యూలు, క్లియరెన్సు, ఫ్లయింగ్ ఆపరేషన్ తదితర అంశాలకు సంబంధించి ఎయిర్‌ఏషియా డీజీసీఏను సంప్రదించి ఫ్లయింగ్ లైసెన్సులు పొందాలి.
ఎయిర్ ఏషియా-టాటాల జేవీకి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) ఆమోదం తెలపడంపై టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విదేశీ పెట్టుబడిదారులకు మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారని... దేశంలో పారిశ్రామిక రంగంలో విశ్వాసాన్ని పెంచేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయని ఆయన ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications