కింగ్‌ఫిషర్‌కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు బ్యాంకుల సబ్‌గ్రూప్ ఏర్పాటు

ఇటీవలే పునరుద్దరణ ప్రణాళికతో కింగ్‌ఫిషర్ ముందుకొస్తే లిక్విడేషన్ మరియు ఇతర విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్‌బీఐ ఛైర్మన్ ప్రతీప్ చౌధురి తెలిపారు. ముంబై ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ ఖాళీ చేయడం ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో ఎస్‌బీఐ ఛైర్మన్ ప్రతీప్ చౌధురి వ్యాఖ్యనించారని అందరూ భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రారంభించిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థ ఇన్‌ఫ్రా డెట్ ఫండ్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ఇది ఇలా ఉంటే కింగ్‌ఫిషర్ ఉద్యోగులతో ఆ కంపెనీ చైర్మన్ విజయ్ మాల్యా ఇటీవల సమావేశమయ్యారు.
వేతన బకాయిలపై పిటిషన్ వేస్తామని ఉద్యోగులు హెచ్చరించిన నేపథ్యంలో కంపెనీకి చెందిన పైలట్లు, ఇంజనీర్లలోని ఒక వర్గం వారితో ఆయన భేటీ అయ్యారు. కింగ్‌ఫిషర్ కంపెనీ విమానాలు నిలిపివేసిన తర్వాత విజయ్ మాల్యా ఉద్యోగులతో సమావేశమవడం ఇదే తొలిసారి. కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించడానికి డీజీసీఏ, రుణాలిచ్చిన బ్యాంకుల నుంచి నో అబ్జెక్షన్ లెటర్ కోసం తన శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన వారికి వివరించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 755 కోట్ల నష్టాలకు చేరింది.
కార్యకలాపాల పునరుద్ధరణకు నిధులు సమకూర్చుకునే విషయమై మరింత స్పష్టత కావాలంటూ డీజీసీఏ కింగ్‌ఫిషర్‌ను కోరింది. కంపెనీకి రూ. 7,000 కోట్ల మేర రుణభారం, రూ. 8,000 కోట్ల నష్టాలు ఉన్నాయి. ఉద్యోగులు మాత్రం ఎనిమిది నెలల్లో తమ వేతన బకాయిలను చెల్లించే భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు రాకపోతే కింగ్‌ఫిషర్‌ను మూసివేయాలని కోరుతూ న్యాయస్దానాన్ని ఆశ్రయించాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. తమ భవిష్యత్ కార్యచరణను వివరించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ని కలవడంతో పాటు.. అలాగే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి, ప్రధానిని కలవనున్నారు.
కింగ్‌ఫిషర్ పునరుద్దరణ ప్రణాళికను వివరాలతో మాతో పంచుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నాం. జీతాల బకాయిలను దశల వారీగా చెల్లించే ప్రణాళికను కూడా వెల్లడించాలి. యాజమాన్యం సమాధానం మాకు సంతృప్తిని ఇవ్వకపోతే, కంపెనీల చట్టంలోని 433 సెక్షన్ క్రింద న్యాయస్దానంలో కంపెనీని మాసియాలంటూ పిటీషన్ దాఖలు చేస్తాం అంటూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications