ద్రవ్యలోటు రాబోయే సంవత్సరాల్లో భారత్ వృద్దిని తగ్గిస్తుంది: మూడీస్

మధ్యకాలానికి ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి బలహీనంగా ఉంటుందని భావిస్తున్నామని మూడీస్ పేర్కొంది. పన్నుల వసూళ్లు, ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా ఖర్చుచేయడం తదితర అంశాల్లో నిలకడైన వృద్ధి ఉంటే రేటింగ్ అప్‌గ్రేడ్ అవుతుంది. భారత ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.4%, వచ్చే ఏడాదిలో 6% చొప్పున ఉంటాయని మూడీస్ అంచనా వేసింది.
అంతక ముందు భారత్ అభివృద్దిపై అంతర్జాతీయ రేటింగ్ సంస్దలు రెండు విభిన్న అభిప్రాయాలను తెలిపాయి. వివరాల్లోకి వెళితే వచ్చే సంవత్సరంలో భారత్ వృద్ది అవకాశాలు మెరుగుపడతాయని అంతర్జాతీయ రేటింగ్ సంస్ద మూడీస్ తెలుపగా.. వచ్చే రెండు సంవత్సరాల్లో భారత్ రేటింగ్ మళ్లీ తగ్గే ప్రమాదం మూడింట ఒక వంతు అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ తెలిపింది. పెట్టుబడులకు సంబంధించి అతి తక్కువ గ్రేడ్ అయిన ‘బీబీబీ మైనస్' రేటింగ్‌ను భారత్‌కి యథాతథంగా ఉంచుతున్నట్లు స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) తెలిపింది.
ఐతే ప్రస్తుత రాజకీయ పరిస్దితులు క్షీణించి, ఆర్దిక సంస్కరణల వేగం మందగిస్తే రేటింగ్‌ను డౌన్ గ్రేడ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. పెరిగిపోతున్న ద్రవ్యలోటుతో పాటు అధిక ద్రవ్యోల్బణం కారణంగా మళ్లీ భారత్ రేటింగ్ బీబీబీ-స్థాయికి రావచ్చునని అంచనా వేసింది. ఈ రేటింగ్ వల్ల పెట్టుబడులకు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపింది. 2014 మధ్యలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల్లో కానీ ప్రభుత్వ రంగంలో గానీ ఒక మోస్తరు సంస్కరణలు మాత్రమే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ వివరించింది. దేశీయంగా రాజకీయ పరిస్థితులు బాగున్నాయని, కంపెనీలు దూకుడుగా ఉన్నాయని, మరిన్ని పెట్టుబడులు, జీడీపీ వృద్ధి ఖాయమని మూడీస్ తన నివేదికలో పేర్కొంది.
మనదేశం ఆర్థికంగా బలపడి మళ్లీ 8 శాతం వృద్ధిరేటు సాధిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం వ్యక్తం చేశారు. ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న మనం వచ్చే సంవత్సరానికి ఏడు శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని దానిని అధిగమించి రానున్న కాలంలో 8 శాతం సాధించగలమని ఆయన చెప్పారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications