కింగ్‌ఫిషర్‌కు నవంబర్ 30 వరకు గడువిచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ: నవంబర్ 30వ తారీఖు కల్లా కింగ్ఫిషర్ ఎయిర్‌లైన్స్ కొత్తగా మూలధనాన్ని సమకూర్చలేకపోతే, ఎయిర్‌లైన్స్ సేవలు తిరిగి ప్రారంభించడం మరింత కష్టం అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పేర్కొంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంకుల నుండి సుమారు రూ. 7,500 కోట్ల రుణాలను తీసుకుంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రధానమైంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ ప్రతీప్ చౌధురి మాట్లాడుతూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి బ్యాంకులు చాలా ప్రయత్నించాయి. కంపెనీనే సరిగా పనిచేయడం లేదు. కింగ్‌ఫిషర్ యాజమాన్యం నిధులు తీసుకొచ్చేందుకు గాను నవంబర్ 30 వరకూ గడువు ఇచ్చాం. ఈ గడువు లోగా మూలధనాన్ని తీసుకురాలేకపోతే కంపెనీ విమానాలు ఎగరవని అన్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల పెట్టుబడుల కోసం విదేశీ విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ విజయ్ మాల్యా తెలిపారు. యూబీ గ్రూప్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాల్యా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అవును మేం చర్చలు జరుపుతున్నామని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించేందుకు ప్రత్యేక ప్రక్రియ ఒకటుందని విజయ్ మాల్యా చెప్పారు. దేశంలో ఉన్న పలు బ్యాంకులకు కింగ్‌ఫిషర్ దాదాపు రూ.7,000 కోట్ల మేరకు బకాయిలు పడింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పునరుద్దరణ ప్రణాళికను ఏవియేషన్ రెగ్యులేటర్ DGCAకు సమర్పించే భాగంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ విజయ్ మాల్యా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కె.ఎన్ శ్రీవాత్సవను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పరిస్దితిని ఆయనకు వివరించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లాకౌట్ అయిన తర్వాత తొలిసారి యూబి గ్రూప్ ఛైర్మన్ విజయ్ మాల్యా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కె.ఎన్ శ్రీవాత్సవతో 30 నిమిషాల పాటు చర్చించినట్లు సమాచారం.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications