
గత 12 నెలలుగా దేశంలో వృద్ధి గాడి తప్పిందని, ప్రధానంగా పెట్టుబడులపై విశ్వాసం తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం ఎగబాకడం వంటివి దీనికి కారణాలుగా నిలుస్తున్నట్లు రతన్ చెప్పారు. ప్రధానమంత్రి తన సత్తాను చాటుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రభుత్వ విశ్వసనీయతను నిలబెట్టడంతో పాటు సంస్కరణల హామీలను నెరవేర్చడం ద్వారా దేశం మళ్లీ అధిక వృద్ధి బాటలోకి వచ్చేలా చూడాలి. అదేవిధంగా వృద్ధికి ఆటంకాలను తొలగించేందుకు కృషిచేయాలి అని టాటా పేర్కొన్నారు.
గత ఏడాది కాలంగా ప్రతిపక్షాలు, మీడియా, కొందరు వ్యక్తులు... చివరకు సర్కారులో భాగస్వామ్యం వహిస్తున్న సభ్యులూ ప్రధానిపై నిర్దాక్షిణ్యంగా విమర్శలు గుప్పించడం విచారించదగిన, దురదృష్టకరమైన విషయం. 1991లో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడంతో పాటు భారత్‌కు అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తిపై అటువంటి వ్యాఖ్యలు తగవని టాటా తెలిపారు.
సంస్కరణల అమలు లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారని 'అండర్ అచీవర్ పేరుతో బ్రిటన్ కేంద్రంగా వెలువడుతున్న 'టైమ్స్' మేగజైన్, 'ప్రధాని మన్మోహన్ ముఖ చిత్ర కథనం' ప్రచురించడం, ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత్‌లో పెట్టుబడులకు అననుకూల వాతావరణం నెలకొందని, మలి విడత సంస్కరణల అమలుకు ప్రధాని చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు పలు అంతర్జాతీయ మేగజైన్లు, మీడియా కూడా ప్రధానిపై ఆర్థిక సంస్కరణల అమలులో విమర్శలు చేయడాన్ని రతన్ టాటా తప్పు పట్టారు.
హామీల మేరకు సంస్కరణల అమలుతో సంప్రదాయ విరామానికి మన ప్రధాని తెర దించుతారు, ప్రభుత్వ విశ్వసనీయతను తిరిగి సాధిస్తారు, తద్వారా ఆర్థిక వృద్ధిరేటుకు ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తారు అని టాటా తెలిపారు. ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో నడిపించేందుకు ప్రధాని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని టాటా తన లేఖలో స్పష్టం చేశారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications