
ఔట్‌సోర్సింగ్ వ్యాపారం నానాటికీ పుంజుకోవడం, క్లౌడ్ రంగం విస్తరణతో భారత ఐటి కంపెనీలు మరింత మంది ఉద్యోగులను విదేశాలకు పంపాలని భావిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ సంవత్సరం అమెరికాలో హెచ్-1బి వీసాల కోసం 5,900 దరఖాస్తులను పంపింది. గత సంవత్సరం పంపిన దరఖాస్తుల సంఖ్య 4,500తో పోలిస్తే అదనంగా 1400 వీసాలు కావాలని కోరుతోంది. ఎల్1 కేటగిరీలో వీసా దరఖాస్తుల్లో అత్యధికం రిజెక్ట్ అవుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మరిన్ని దరఖాస్తులు పంపినట్టు సంస్థ హెచ్‌ఆర్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు.
కంపెనీలు మూడు రకాల వీసాలపై తమ ఉద్యోగులను విదేశాలకు పంపే వీలుంటుంది. అవి
బిజినెస్ వీసా (బీ1)
ఎల్ 1 వీసా
హెచ్-1బి వీసా: నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా
భారత ఐటి కంపెనీలు కామన్‌గా ఎల్1 వీసా కేటగిరీని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో భాగంగా సంస్థలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులను అమెరికాలోని తమ కార్యాలయాలకు బదిలీ చేసేందుకు అనుమతి కోరుతారు. మరో ప్రధాన కేటగిరీ హెచ్-1బి. ఇందులో అమెరికాలోని కంపెనీలు నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను నియమించుకునే సదుపాయం లభిస్తుంది.
మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కంపెనీ వీసా ఫీజుల నిమిత్తం 7 మిలియన్ డాలర్లు (సుమారు 39 కోట్ల రూపాయలు) వెచ్చించింది. అయితే, వీసా ఫీజులు ఒక్కో త్రైమాసికంలో ఒక్కోలా వుంటాయి. గడచిన ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఇదే ఇన్ఫోసిస్ వీసా ఫీజుల రూపంలో 15 మిలియన్ డాలర్లు చెల్లించింది. 2010-11లో మొత్తం 184 కోట్ల రూపాయలను అమెరికాకు ఫీజుగా చెల్లించిన సంస్థ 2011-12లో 202 కోట్ల రూపాయలను చెల్లించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications