
గతేడాది(2011-12)లో వృద్ధిరేటు తొమ్మిదేళ్ల కనిష్టమైన 6.5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు విశ్లేషకులు, రిసెర్చ్ సంస్థలు దేశ జీడీపీ వృద్ధి అంచనాల్లో ఇప్పటికే కోత పెట్టాయి కూడా. తాజాగా జపనీస్ బ్యాంక్ నొమురా భారత వృద్ధిరేటు అంచనాలను 5.5 శాతానికి తగ్గించింది. ప్రభుత్వం ఈ ఏడాది 7.6 శాతం వృద్ధిరేటును అంచనా వేస్తుండగా, స్టాన్‌చార్ట్ ఆర్థికవేత్తలు మాత్రం 6.2 శాతంగా ఉండొచ్చని చెబుతున్నారు.
వృద్ధి మందగమనానికి ప్రధానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనతలు, ఎగుమతులు తగ్గుముఖం, కరెంట్ అకౌంట్ లోటు ఎగబాకుతుండటం, రూపాయి విలువ భారీ పతనంతో పాటు ప్రభుత్వంలో విధానపరమైన జడత్వాలను విశ్లేషకులు పేర్కొంటున్నారు. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ వడ్డీరేట్లను అధిక స్థాయిలోనే కొనసాగిస్తుండటం కూడా ఇందుకు ఒక కారణమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సర్వే నివేదికలో ఇతర ముఖ్యాంశాలు....
దక్షిణాదికి చెందిన 125 మంది కార్పోరేట్ కంపెనీలతో జరిపిన సర్వేలో 72 శాతం మంది 6 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తామని వెల్లడించారు. 2008 నాటి ఆర్థిక మాంద్యం ముందు నమోదైన 9 శాతం వృద్ధి రేటును 2016లో తిరిగి అందుకుంటామని 85 శాతం మంది వెల్లడించారు. 2014లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తరువాత జిడిపి వృద్ధిపై స్పష్టమైన అవగాహనకు రావచ్చని, ఈ లోగా 9 శాతం వృద్ధి ఎంత మాత్రమూ సాధ్యం కాదని సర్వేలో పాల్గొన్న వారంతా వెల్లడించారు. ఇక రానున్న పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ అర శాతం మేర కీలక వడ్డీరేట్లను తగ్గించొచ్చని 66 శాతం మంది అంచనా వేస్తున్నారు.
ఈ నెలలో జరగనున్న పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు 75 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గవచ్చని 27 శాతం మంది, 50 బేసిస్ పాయింట్ల వరకూ కోత వుంటుందని 66 శాతం మంది అంచనా వేశారు. సెప్టెంబర్ నాటికి యుఎస్ డాలర్‌తో రూపాయి మారకపు విలువ 57 రూపాయల కన్నా ఎక్కువగా వుంటుందని 40 శాతం మంది పేర్కొనగా, మరో 4 శాతం మంది 60 రూపాయలను దాటుందని, 40 శాతం మంది 55 నుంచి 57 రూపాయల రేంజ్‌లో వుంటుందని సర్వేలో అభిప్రాయపడ్డారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications