
రూపాయి బలహీనత ఇదే విధంగా కొనసాగితే దేశంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం రేటును ఇంతక్రితం 6.7 శాతం అంచనా నుంచి 7.3 శాతానికి పెంచింది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్లు తగ్గింపునకు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సంకేతాలను ఇచ్చే అవకాశం లేదని కూడా అభిప్రాయపడింది. రెండవ తైమాసికం ముగిసే వరకూ వడ్డీరేట్లు తగ్గించే పరిస్థితి లేదని పేర్కొంది.
ఇందుకోసం గాను స్టాక్ మార్కెట్లో మరింత పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరగాలంటే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువలతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నమ్మకం ప్రధానాంశాలు. నేడు ప్రణబ్ ప్రకటించే నిర్ణయాలు కూడా అందుకు తగ్గట్టుగానే వుంటాయని అంచనా. ప్రవాస భారతీయులు ఇండియాలోని బ్యాంకుల్లో దాచే డిపాజిట్లపై మరింత వడ్డీని ఇవ్వడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రత్యేక సెక్యూరిటీ బాండ్ల స్కీమ్‌ను కేంద్రం తరఫున ప్రకటించడం వంటి ఆఫర్లు వుండవచ్చు.
వీటితో పాటు ఆర్‌బిఐ మరిన్ని డాలర్లను ఎగుమతి దారులకు విక్రయించేలా ప్రోత్సహించడం, పరిశ్రమలు గతంలో తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరిస్తూ, బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల శాతాన్ని తగ్గించేలానూ కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో ద్రవ్యలభ్యత సరళతరంగా లేదని, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో అభివృద్ధి, విస్తరణ తదితరాలకు నిధుల కొరత పీడిస్తోందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ చైర్మన్ వైకె అలాగ్ వ్యాఖ్యానించారు. వృధా ఖర్చులను తగ్గిస్తూ, పెట్టుబడులను ఆకర్షించేలా ఆర్థిక మంత్రి ప్రకటన వుంటుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications