కేజీ-డీ6లో గ్యాస్ నిల్వలు 80% తక్కువే: నికో రిసోర్సెస్

గతంలో కేజీ-డీ6 క్షేత్రంలో రూఢీచేసుకున్న, నమ్మదగిన(ప్రూవ్డ్ అండ్ ప్రాబబుల్-2పీ) గ్యాస్ నిల్వలు 9.65-9.9 లక్షల కోట్ల ఘనపుటడుగులు(టీసీఎఫ్)గా అంచనా వేయగా, ఇది ఇప్పుడు 80 శాతం తక్కువగా 1.93 టీసీఎఫ్‌కు పడిపోయిందని నికో వెల్లడించింది. తాజా పరిణామంతో రిలయన్స్ షేరు ధర బీఎస్‌ఈలో రూ.19(2.58%) పడిపోయి రూ.718 వద్దకు దిగజారింది.
కేజీ-డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి నానాటికీ తీసికట్టు చందంగా దిగజారుతూ వస్తోంది. తాజాగా ఇక్కడ ఉత్పత్తి రోజుకి 31.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) స్థాయికి క్షీణించింది. మే నెలోలో 32.66 ఎంఎంఎస్‌సీఎండీలుగా ఉంది. డీ1, డీ3 గ్యాస్ క్షేత్రాల్లో మొత్తం 18 బావుల్లో ఆరు, ఎంఏ చమురు క్షేత్రంలో 6 బావుల్లో నుంచి రెండింటిని మూసివేయాల్సి వచ్చిందని, బావుల్లో నీరు చేరిక, ఇసుక మేటలు వేయడం వంటి సమస్యలే ఈ ఎనిమిది బావుల మూతకు కారణమని రిలయన్స్ తన వాదనను వినిపిస్తుంది.
2010 మార్చిలో ఉత్పత్తి గరిష్టంగా రోజుకు 61.5 ఎంఎంఎస్‌సీఎండీలుగా నమోదుకాగా ఇప్పుడు దీనిలో దాదాపు సగం మేర తగ్గిపోవడం గమనార్హం. కాగా, డీ1,డీ3ల్లో ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్టమైన 28 ఎంఎంఎస్‌సీఎండీ దిగువకూ చేరిందని, ఈఏడాది(2012-13)లో 20 ఎంఎంఎస్‌సీఎండీలకూ పడిపోవచ్చని తాజాగా చమురు శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి పార్లమెంట్‌లో కూడా చెప్పారు. 2006లో ఆమోదించిన ఎఫ్‌డీపీ ప్రకారం ఈ ఏడాదికే కేజీ-డీ6లో ఉత్పత్తి 80 ఎంఎంఎస్‌సీఎండీలకు చేరాల్సి ఉంది. ఇప్పటికే మొత్తం 31 బావులను రిలయన్స్ తవ్వాల్సి ఉండగా, కేవలం 18 బావులకే పరిమితమైందని... దీనివల్లే ఉత్పత్తి తీవ్రంగా పడిపోయిందని డీజీహెచ్ తేల్చిచెప్పింది.
ఐతే కేజీ-డీ6 రిజర్వాయర్‌లో భౌగోళిక సంక్లిష్టతల కారణంగా తగిన డ్రిల్లింగ్ ప్రాంతాలను గుర్తించలేకపోతున్నామని, అందువల్ల మరిన్ని బావులను ఇప్పట్లో తవ్వడం సాధ్యంకాదని కూడా రిలయన్స్ వాదిస్తోంది. ఇదిలాఉండగా, తగినన్ని ప్రణాళిక ప్రకారం బావులను తవ్వకపోవడం వల్లే గ్యాస్ ఉత్పత్తి తగ్గిందని చెబుతూ చమురు శాఖ రిలయన్స్ క్షేత్ర అభివృద్ధి వ్యయంలో 1.5 బిలియన్ డాలర్ల కోత విధిస్తున్నట్లు ఇదివరకే నోటీసులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications