IT Jobs: డిజిటల్ యుగంలో ఐటీ వేగంగా అభివృద్ధి చెందటం వల్ల టెక్కీలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రతి ఏటా ఈ రంగంలో డిమాండ్ పెరగుతూనే ఉండటం వాస్తవం. అయితే ప్రస్తుతం ఆర్థిక మందగమనం కారణంగా ఈ స్పీడ్ కాస్త తగ్గింది. అయితే ఒక పరిశ్రమలో మాత్రం డిమాండ్ అస్సలు తగ్గలేదు. పైగా ప్రస్తుతం 20 లక్షల ఉద్యోగుల అవసరం ఉందని తెలుస్తోంది.

ఫ్యూచర్ జాబ్స్..
కాలేజ్ గ్రాడ్యుయేట్లు పక్కాగా ప్లాన్ చేసుకుంటే లక్షల్లో వేతనం అందుకునేందుకు ఈ రంగం సరైనదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇంత డిమాండ్ ఉన్న ఉద్యోగం ఏమిటా అని అనుకుంటున్నారా.. అదే సైబర్ సెక్యూరిటీ. అవును కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు సైబర్ దాడుల ముప్పును ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ నిపుణులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.

సైబర్ సెక్యూరిటీ..
ఇంటర్నెట్ సేవలను కలిగి ఉన్న అన్ని కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరమయ్యే స్థాయికి సైబర్-దాడులు పెరిగిపోయాయి. ఈ రంగంలో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్ల నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. గత ఏడాది మాత్రమే ఈ సెక్టార్ 4,64,000 మంది నిపుణులకు ఉపాధి కల్పించింది. డిజిటలైజేషన్ పెరిగేకొద్దీ వీరికి డిమాండ్ పెరుగుతూనే ఉంది.

ఉద్యోగుల కొరత..
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 21.6 లక్షల మంది సైబర్ నిపుణుల కొరత ఉంది. సరైన సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ లేకపోతే.. కంపెనీ నెట్‌వర్క్ అధిక రిస్క్ సైట్‌గా పరిగణించబడుతుంది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ వర్క్‌ఫోర్స్ ప్రస్తుతం 4.7 మిలియన్లుగా ఉంది.

ఉత్తర అమెరికా..
సైబర్ సెక్యూరిటీ సెక్టార్‌లో కొత్త ఉద్యోగులను నియమించుకోవడంలో ఉత్తర అమెరికా అతి తక్కువ వృద్ధిని సాధించింది. ఉత్తర అమెరికాలో 6.2 శాతం వృద్ధి ఉన్నప్పటికీ.. 1.34 మిలియన్ల సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఉన్నారు. నిరంతరం ఈ రంగంలో నిపుణుల నియామకాలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఆటోమేషన్, IoT, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ ఉద్యోగులకు అధిక డిమాండ్ ఉంది. విదేశాల్లోని అవకాశాలు మెండుగా ఉండటం భారతీయులకు కలిసొచ్చే అంశం.


Click it and Unblock the Notifications