LPG Price Hike: మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన రేట్లు..
Commercial LPG Cylinder Price Hike: డిసెంబర్ మెుదటి తారీఖున ఎప్పటి మాదిరిగానే దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ ధరలను మార్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్యోల్బణ సమయంలో ప్రజలపై మరింత భారం పడే ప్రకటన వెలువడింది.
దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే గ్యాస్ రేట్ల వడ్డింపు మెుదలైంది. దీంతో వ్యాపారులు వినియోగించే 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. తాజాగా పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రకటించాయి.దీనికి ముందు నవంబర్ 16న ఛత్ పండుగ రోజున కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.50 చొప్పున తగ్గించిన కంపెనీలు నేడు మాత్రం ఒక్కో సిలిండరుపై రూ.21 పెంచుతున్నట్లు ప్రకటించాయి.

దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిన 19 కేజీల గ్యాస్ సిలిండర్ల ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని దిల్లీలో రూ.1,796.50గా ఉండగా.. కోల్‌కతాలో రూ.1,908 వద్ద విక్రయించబడుతున్నాయి. ఇదే క్రమంలో ముంబైలో కమర్షియల్ సిలిండర్ పెరిగిన ధర రూ.1,749గా ఉండగా.. చెన్నైలో అత్యధికంగా రూ.1,968.50గా కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన తాజా ధరలను పరిశీలిస్తే.. హైదరాబాదులో 19 కిలోల సిలిండర్ రేటు రూ.2,002గా ఉంది.
ఇదే క్రమంలో గృహ వినియోగదారుల 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. దేశంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సామాన్యులపై భారాన్ని తగ్గించి వారిని ప్రసన్నం చేసుకునే క్రమంలో వీటి ధరలను ప్రభుత్వం పెంచకుండా నియంత్రిస్తోంది. దీపావళి సమయంలో భారీగా ఒక్కో సిలిండర్ ధరను తగ్గిస్తూ దేశ ప్రజలకు ఉపసమనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో రేట్లను పరిశీలిస్తే.. దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50 వద్ద విక్రయించబడుతున్నాయి.


Click it and Unblock the Notifications