వందల కోట్ల విలువైన అవుట్‌సోర్సింగ్ ప్రాజెక్ట్స్.. ఆ 5 కంపెనీలకే కట్టబెట్టిన కేంద్ర సంస్థలు
Outsourcing projects: ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలు అవుట్ సోర్సింగ్ ద్వారా కొన్ని రకాల పనులను చేపిస్తూ ఉంటాయి. తద్వారా ఉద్యోగుల రిక్రూట్‌మెంట్, వారికి సదుపాయాల కల్పన వంటి ఇబ్బందులు లేకుండా పని పూర్తవుతుంది. అయితే కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఇదే పద్ధతిలో బయటకు ఇచ్చాయి.
పెట్రోలియం, విద్యుత్ సహా నీతి ఆయోగ్, ఆధార్ ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ పనులను ఆయా శాఖలు అవుట్ సోర్సింగ్ కు అప్పగించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. కేంద్రం ఆధ్వర్యంలోని 16 మంత్రిత్వ శాఖలు, పరిపాలనా విభాగాలు.. అనేక కీలకమైన అసైన్‌మెంట్‌లను అగ్ర మల్టీ నేషనల్ కన్సల్టెన్సీ సంస్థలకు కట్టబెట్టినట్లు పేర్కొంది.

సమాచార హక్కు (RTI) చట్టం కింద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ప్రధానంగా 5 కంపెనీలకు ఈ ప్రాజెక్టులు దక్కినట్లు నివేదిక తెలిపింది. ఏప్రిల్ 2017-జూన్ 2022 మధ్య ప్రైస్‌వాటర్-హౌస్‌కూపర్స్ (PwC), డెలాయిట్ టచ్ తోమట్సు లిమిటెడ్, ఎర్నెస్ట్ & యంగ్ గ్లోబల్ లిమిటెడ్ మరియు KPMG ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహా US ఆధారిత మెకిన్సే & కంపెనీలు కనీసం 308 కన్సల్టెన్సీలను పొందినట్లు రికార్డులు చూపిస్తున్నాయట.
వివిధ మంత్రిత్వ శాఖలు మరియు సంస్థల నుంచి బయటకొచ్చిన ఈ అసైన్‌మెంట్‌ల విలువ దాదాపు 500 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ల్లో ఆర్థిక నిర్వహణ, అడ్వైజరీ సర్వీసెస్, టెక్నికల్ కన్సల్టెంట్‌ల నియామకం, ఇ-గవర్నెన్స్ అవార్డుల నామినేషన్స్ మూల్యాంకనం వంటి అనేక రకాల కార్యకలాపాలు ఉన్నట్లు మీడియా సంస్థ బయటపెట్టింది.
నివేదిక ప్రకారం.. 2017-2022 మధ్య కాలంలో 156 కోట్ల విలువైన 92 కాంట్రాక్టులను పొంది PwC అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. 59 అసైన్‌మెంట్స్‌కు సంబంధించి 130.13 కోట్ల విలువతో డెలాయిట్ తరువాతి స్థానం సాధించింది. ఇక E&Y 88.05 కోట్ల విలువైన 87 కాంట్రాక్టులు, 68.46 కోట్ల విలువైన 66 కాంట్రాక్టులతో KPMG, 50.09 కోట్లతో మెకిన్సీ 3 కాంట్రాక్టులను పొందాయి.


Click it and Unblock the Notifications