ముంబై: దీపావళి పర్వదినం తర్వాత మార్కెట్‌లు జోరుమీద ఉన్నాయి. వరుసగా రెండు రోజులు (అక్టోబర్ 29, 30) మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ నెలలో అక్టోబర్ 9వ తేదీ తర్వాత జరిగిన 14 సెషన్లలో 11 సెషన్లు కూడా మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. మొత్తంగా 15 సెషన్లలో సెన్సెక్స్ 2500 పాయింట్లు ఎగబాకింది.
దీంతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.11 లక్షల కోట్లు పెరిగింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 12,000 నుంచి 12,400 మధ్యకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. బుధవారం సెన్సెక్స్ 220 పాయింట్లు పెరిగి 40,052 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11,844 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నట్లు చెబుతున్నారు.

మార్కెట్లకు దీపావళి కొత్త ఉత్సాహం నింపింది. ముహూరత్ ట్రేడింగ్‌లో లాభాలతో శుభారంభం చేసిన స్టాక్స్ మంగళ, బుధవారం ఏమాత్రం తగ్గలేదు. సంవత్ 2076లో తొలి పూర్తి సెషన్ మంగళవారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఇంట్రాడేలో ఏకంగా 666 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్, చివరికి 581.64 పాయింట్ల లాభంతో 39,831.84 వద్ద క్లోజ్ అయింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని ఉద్దీపన చర్యలు ఉంటాయనే అంచనాలకు తోడు వివిధ కారణాలతో మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. కేవలం మంగళవారం ఒక్కరోజులోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.2.73 లక్షల కోట్లు పెరిగి రూ.152,04,693.34 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications