Petrol Prices: పెట్రోల్ ధరల సెగ! ఇకపై ఫుడ్ డెలివరీ ఛార్జీలు కూడా పెరగనున్నాయా?
మీకు ఆకలి వేసినప్పుడు నిమిషాల్లో వచ్చే బిర్యానీ అయినా.. వంట గదిలోకి అవసరమైన కూరగాయలైనా.. ప్రస్తుతం 10 నిమిషాల క్విక్ కామర్స్ డెలివరీ యాప్స్ ద్వారా చిటికెలో ఇంటికి వచ్చేస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్‌లో తరచూ ఆర్డర్లు పెట్టే కస్టమర్లకు రాబోయే రోజుల్లో డెలివరీ ఛార్జీల భారం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇటీవల దేశీయంగా పెరిగిన ఇంధన ధరలే దీనికి ప్రధాన కారణం.
ఇటీవల లీటరుకు సుమారు రూ. 4 వరకు పెరిగిన పెట్రోల్ ధరలు (petrol price) ప్రభావం వల్ల ఎటర్నల్ (Eternal), స్విగ్గీ (Swiggy) వంటి ఫుడ్ డెలివరీ , క్విక్ కామర్స్ సంస్థలపై స్వల్పకాలిక ఆర్థిక ఒత్తిడి పడనుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'ఎలారా క్యాపిటల్' (Elara Capital) తన తాజా నివేదికలో వెల్లడించింది.

ఒక ఆర్డర్ డెలివరీ చేయడానికి ఎంత ఖర్చవుతుంది?
ఎలారా క్యాపిటల్ అంచనా ప్రకారం.. ప్రస్తుతం క్విక్ కామర్స్ (గ్రాసరీస్) లో ఒక్కో ఆర్డర్ డెలివరీ చేయడానికి కంపెనీలకు రూ. 35 నుండి రూ. 50 వరకు ఖర్చవుతోంది. అదే ఫుడ్ డెలివరీ విషయానికి వస్తే ఈ ఖర్చు రూ. 55 నుండి రూ. 60 వరకు ఉంటుంది. సగటున చూసుకుంటే ఎటర్నల్ సంస్థకు ఒక ఆర్డర్‌పై రూ. 45, స్విగ్గీ సంస్థకు రూ. 55 వరకు డెలివరీ కాస్ట్ అవుతోంది.
ఈ మొత్తం డెలివరీ ఖర్చులో దాదాపు 20 శాతం కేవలం ఇంధనం (Fuel) కోసమే ఖర్చవుతుంది. అంటే ప్రతి ఆర్డర్ వెనుక సగటున రూ. 9 నుండి రూ. 10 వరకు ఇంధన వ్యయం ఉంటుంది. ఇప్పుడు పెరిగిన 4 శాతం పెట్రోల్ ధరలు (petrol price) వల్ల కంపెనీలపై ఒక్కో ఆర్డర్‌కు అదనంగా 44 పైసల భారం పడనుంది.
భవిష్యత్తులో భారం మరింత పెరిగితే?
ఒకవేళ రాబోయే నెలల్లో గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల వల్ల పెట్రోల్ ధరల పెంపు లీటరుకు రూ. 4 నుండి ఏకంగా రూ. 10 కి చేరితే మాత్రం.. కంపెనీలకు ఒక్కో ఆర్డర్‌పై రూ. 1 నుండి రూ. 1.2 వరకు అదనపు భారం పడుతుంది.
- స్విగ్గీపైనే ఎక్కువ ప్రభావం: ఈ అదనపు భారాన్ని కస్టమర్లపైకి నెట్టకుండా కంపెనీలే భరిస్తే.. FY27 అడ్జస్టెడ్ ఎబిటా (EBITDA) లో ఎటర్నల్‌కు 4-5 శాతం, స్విగ్గీకి ఏకంగా 10-12 శాతం మేర నష్టం వాటిల్లవచ్చు. క్విక్ కామర్స్ విభాగంలో స్విగ్గీ ఇంకా లాభాల్లోకి (Break-even) రాలేదు కాబట్టి, ఆ సంస్థపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
- ఎటర్నల్ సేఫ్ జోన్: ఎటర్నల్ సంస్థకు భారీ కస్టమర్ బేస్ ఉండటం, అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఎక్కువగా రావడం , దాని కస్టమర్లు ప్రీమియం కేటగిరీకి చెందిన వారు కావడంతో (ధరల పెంపును పెద్దగా పట్టించుకోని వారు) ఈ నష్టాన్ని సులభంగా రికవర్ చేసుకోగలదని నివేదిక పేర్కొంది.
కస్టమర్ల జేబుకు చిల్లు పడటం ఖాయమేనా?
FY27 ఆర్థిక సంవత్సరంలో ఎటర్నల్ దాదాపు 2.7 బిలియన్ల ఆర్డర్లను, స్విగ్గీ 1.4 బిలియన్ల ఆర్డర్లను హ్యాండిల్ చేయనున్నాయి. ఈ భారీ సంఖ్యలో వచ్చే అదనపు ఖర్చును కంపెనీలు పూర్తిగా భరించలేవు. కాబట్టి ఈ పెట్రోల్ భారాన్ని మూడు విధాలుగా సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కొంత భారాన్ని కస్టమర్లపై డెలివరీ ఛార్జీల రూపంలో వేయడం, మరికొంత భాగాన్ని ప్లాట్‌ఫారమ్‌లు భరించడం, మిగిలిన భాగాన్ని డెలివరీ పార్ట్‌నర్స్ (గిగ్ వర్కర్స్) పేఅవుట్స్‌పై ఒత్తిడి తేవడం ద్వారా సర్దుబాటు చేయవచ్చు.
ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇంధన ధరలు ఇలాగే పెరిగితే.. మీ ఫేవరెట్ ఫుడ్ లేదా గ్రాసరీ డెలివరీ బిల్లులో అదనంగా కొన్ని రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉండక తప్పదు.


Click it and Unblock the Notifications