టీ ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక మండలి, నల్గొండ నుండి ఏపీకి ఓసీటీఎల్..!
హైదరాబాద్: కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అభివృద్ధి చట్టం - 2006 ప్రకారం తెలంగాణ రాష్ట్ర మైక్రో, అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (టీఎస్ఎంఎస్ఈఎఫ్సీ)ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) సమస్యల పరిష్కారానికి వీలుగా ప్రత్యేక సహాయ మండలిని ఏర్పాటు చేస్తూ.. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి సబ్యసాచి ఘోష్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2006లో తీసుకువచ్చిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది చట్టంలో భాగంగా ఈ మండలిని నెలకొల్పారు. పరిశ్రమల శాఖ కమిషనర్ ఛైర్మన్‌గా వ్యవహారించే ఈ మండలిలో రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌సి) ఎండి, పరిశ్రమల ఫెడరేషన్ అధ్యక్షుడు, సీసీఐ అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం కన్వీనర్ సభ్యులుగా ఉంటారు. ఈ మండలి కాలపరిమితిని రెండు సంవత్సరాలు.
ఆంధ్రప్రదేశ్‌కు మారనున్న ఓసీటీఎల్ ప్లాంటు

నల్గొండ జిల్లా ఉత్పత్తి కేంద్రంలోని కొన్ని విభాగాలను ఏపీకి మార్చాలని డ్రిల్లింగ్ పైపుల తయారీ సంస్థ ఓసీటీఎల్ నిర్ణయించింది. తీవ్రమైన విద్యుత్ కొరత, కార్మికుల ఆందోళన వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సంస్థ చెబుతోంది. ఓసీటీఎల్ బోర్డు గురువారం నాడు సమావేశమై తెలంగాణలో విద్యుత్ పరిస్థితిపైనా, నల్గొండ జిల్లాలోని ప్లాంటులో ఎదురవుతున్న కార్మిక సమస్యలపైనా చర్చించింది.
సహేతుకమైన కారణం లేకుండానే సమ్మెకు దిగిన కార్మికులు ఉత్పత్తికి విఘాతం కలిగిస్తున్నట్టుగా కంపెనీ వెల్లడించింది. స్వల్పకాలంలోనే మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడానికి అనువైన ప్రాంతాలకు నల్గొండ ప్లాంటులోని కొన్ని విభాగాలను మార్చాలని నిర్ణయించినట్టుగా తెలియజేసింది.
భవిష్యత్ విస్తరణను కూడా దృష్టిలో ఉంచుకుని నీరు, విద్యుత్ లభ్యత దండిగా ఉన్న ప్రాంతాలను, రేవులకు సమీపంలో ఉన్న ప్రాంతాలను ఎంపిక చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. గత ఆగస్టులో తాము యూనియన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని కార్మికులు చేస్తున్న ఆరోపణలను ఓసీటీఎల్ ఖండించింది.
కొద్ది రోజులుగా ఓసీటీఎల్ తన ఉత్పత్తి కార్యకలాపాలను ఆంధ్ర ప్రదేశ్‌కు తరలించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు కార్మికులతో వివాదాలే ప్రధానకారణమని చెబుతున్నారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ప్లాంటును మార్చే అవకాశం ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications