కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల హామీలేని రుణాలు ఇస్తామని ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రుణ పథకాన్ని కొన్ని ప్రైవేటు బ్యాంకులు సరిగ్గా అమలు చేయడం లేదని ఆరెస్సెస్ అనుబంధ లఘు ఉద్యోగ్ భారతీ (LUB) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేసింది. కరోనా నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు కేంద్రం ప్రకటించిన రూ.3 ట్రిలియన్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం (ECLGS) అమలుపై అభిప్రాయాన్ని తీసుకునేందుకు లఘు ఉద్యోగ్ భారతీ ప్రధాన కార్యదర్శి గోవింద్ లేలేను ఆహ్వానించారు నిర్మల.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ పథకం ద్వారా రుణాలు ప్రారంభించాయని నిర్మలతో భేటీ అనంతరం గోవింద్ లేలే తెలిపారు. కానీ బ్రాంచ్ లెవల్‌కు వచ్చేసరికి మంజూరుకు ముందు రెవెన్యూ , ప్రాఫిటబులిటీ వంటి అంశాలు ఉంటాయని తెలిపారు.

అయితే ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రయివేటు బ్యాంకులు నిర్లిప్తంగా ఉన్నాయని, కాబట్టి దీనిని అమలు చేయాలని వారికి వెంటనే ప్రభుత్వం సూచించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రికి చెప్పారు. తమ టార్గెట్ కోసం బ్యాంకు అధికారులు అధిక వ్యాల్యూ కలిగిన రుణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, కానీ అందరికీ అందుబాటులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలన్నారు.
నాన్ షెడ్యూల్డ్ కో-ఆపరేటివ్ బ్యాంకుల పోర్ట్‌పోలియోల్లో ఎక్కువగా ఎంఎస్ఎంఈ రుణాలు ఉన్నాయని, కాబట్టి ఈ పథకంలో దీనిని కూడా చేర్చాలని కేంద్ర ఆర్థికమంత్రిని కోరారు. ఈ పథకం అమలుతీరుపై సర్వే నిర్వహిస్తున్నామని, ఓ వారంలో పూర్తవుతుందని చెప్పారు. ఈ ఫలితాలను ఆర్థికమంత్రితో పంచుకుంటామన్నారు.


Click it and Unblock the Notifications