కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఎంఎస్ఎంఈల కోసం ప్రభుత్వ హామీతో కూడిన రూ.3 లక్షల రుణాలు సహా ఇతర ప్రయోజనాలు కల్పించింది. మరోవైపు కరోనా కారణంగా ఎంఎస్ఎంఈలు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాయి. వేతనాల్లో కోత విధించాయి. దేశ రాజధాని ఢిల్లీలో నాలుగింట మూడు ఎంఎస్ఎంఈలు డిమాండ్ లేక వేతనాలు తగ్గిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై ఓ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

ప్రత్యక్ష నగదు సహాయం కోరుకుంటే..
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై అంచనాలు అందుకోలేదని 44 శాతం మంది ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. తాము ప్రభుత్వం నుండి ఉద్యోగుల వేతనాలు వంటి వాటి కోసం ప్రత్యక్ష నగదు సహాయం కోరుకున్నామని, కానీ ప్రభుత్వం నుండి ఆ మేరకు హామీ లభించలేదని 86 శాతం మంది చెప్పారు. కొన్ని సంస్థలు రెండు నెలల ఉద్యోగుల వేతనాలు ప్రభుత్వం భరించాలని కోరిన విషయం తెలిసిందే.

వేతనాలు, బిల్లుల చెల్లింపు ఇబ్బందికరం
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలకు అత్యంత సవాలుతో కూడుకున్నది వేతనాలు చెల్లించడం, బిల్లులు చెల్లించడం, ఇతర స్థిర ఖర్చులు తీర్చడం, అద్దెలు చెల్లించడం వంటివి ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఎమర్జెన్సీగా ఫండ్స్ అవసరమని 77 శాతం మంది చెప్పారు. ఈ సర్వేను విట్టా సలాహ్కర్ సమితి, ట్యాక్స్ లా ఎడ్యుకేర్ సొసైటీ, స్కాచ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటివి కలిసి నిర్వహించాయి. అయితే బిజినెస్ మనుగడ సాగిస్తుందనే బలం పెరిగిందని తేలింది.

ఉద్యోగాల కోత
మే 2020లో ఎంఎస్ఎంఈలు 6 శాతం మేరకు ఉద్యోగుల కోత విధించాయి. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఇది కేవలం 4 శాతంగా మాత్రమే ఉంది. మరో 30 శాతం ఎంఎస్ఎంఈలు సగం మందిని తగ్గించాలని, 26 శాతం కంపెనీలు నాలుగింట ఒక వంతు తగ్గించాలని చూస్తున్నాయని సర్వేలో తేలింది. ఈ సర్వేలో దేశ రాజధాని నుండి 200 మంది పాల్గొన్నారు.

జన్ ధన్ అకౌంట్లో వేసినట్లు..
ఆత్మనిర్భర్ ప్యాకేజీ చాలా బాగుందని 32 శాతం మంది చెప్పారు. ఆశాజనకంగా లేదని 44 శాతం మంది చెప్పారు. ఎంఎస్ఎంఈలకు కూడా నేరుగా.. తక్షణ ఖర్చుల కోసం పేదలకు జన్ ధన్ అకౌంట్లలో వేసినట్లుగా ప్రత్యక్ష నగదు సాయం చేస్తే బాగుండేదని కొంతమంది అభిప్రాయపడ్డారు. అప్పుడు తక్షణ నష్టాల నుండి వారు బయటపడే అవకాశాలు ఉండేదన్నారు. ప్రభుత్వం సాయం లేకుండా వ్యాపారంలో మనుగడ సాగించలేమని 59 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఏప్రిల్ 2020లో ఇలా అభిప్రాయపడిన వారు 77 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications