కరోనా మహమ్మారి కారణంగా ఎంఎస్ఎంఈలు చితికిపోయాయి. వీటికి అండగా ఉండేందుకు కేంద్రం దాదాపు రూ.4 లక్షల కోట్ల ఉద్దీపనలు ప్రకటించింది. ప్రభుత్వమే హామీ ఇచ్చే ఈ రుణం ద్వారా చిన్న కంపెనీలు తిరిగి కోలుకోవడానికి ఉపయోగపడతాయి. మాస్టర్ కార్డ్ కూడా ఇండియాలో చిన్న సంస్థలకు (ఎస్ఎంబీ) అండగా ఉండనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారీ మొత్తాన్ని కేటాయించినట్లు తెలిపింది.

రూ.250 కోట్ల సాయం
కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో చిన్న, మధ్యతరహా కంపెనీలకు సాయం చేసేందుకు రూ.250 కోట్లు (33 మిలియన్ డాలర్లు) కేటాయించినట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. 2025 నాటికి దేశంలో 100 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడతామని గతంలో ఈ టెక్ దిగ్గజం ప్రకటించింది. దీనికి అదనంగా ఇప్పుడు ఈ సాయం ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ సహకారం
నగదు, సరఫరా గొలుసుపై ఎక్కువగా ఆధారపడిన చిన్న కంపెనీలు కరోనా కారణంగా భారీగా ప్రభావితమయ్యాయి. ఈ సవాళ్లను సాధ్యమైనంత మేర పరిష్కరించేందుకు నగదును అందుబాటులోకి తెచ్చేందుకు తద్వారా డిమాండ్ పెంచేందుకు, వ్యాపార పునరుద్ధరణకు ఇది ఉపయోగపడుతుందని మాస్టర్ కార్డ్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్టర్ కార్డ్ 250 మిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా కేటాయిస్తున్నట్లు ఏప్రిల్ నెలలో ప్రకటించింది. ఇందులో భారత్‌కు 33 మిలియన్లు కేటాయించింది.

వీటి కోసం
చిన్న కంపెనీల డిజిటలీకరణకు, ఆయా సంస్థలు రుణాలు సులభంగా పొందేందుకు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీటిని వినియోగిస్తామని మాస్టర్ కార్డ్ సౌత్ ఏషియా చీఫ్ పోరష్ సింగ్ తెలిపారు. చిన్న వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థకు పునాది అని, జీడీపీలో వీటి వాటా 35 శాతం వరకు ఉందన్నారు. కోటి మంది వ్యాపారులు డిజిటల్ సిస్టం ద్వారా నగదును స్వీకరించేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. షాపులు, బ్రాండ్స్‌తో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. దీంతో పారదర్శక అమ్మకాలు పెరిగి ఆర్థిక సంస్థలకు వ్యాపారాలపై స్పష్టత వస్తుందన్నారు.


Click it and Unblock the Notifications