Business Ideas: నగరాల్లో జీవించాలంటే కేవలం ఒక్కరి సంపాదన అస్సలు సరిపోదు. అలా అని మహిళలు చాలా మందికి చిన్న పిల్లలు ఉండటం లేదా ఇతర అనేక కారణాలతో ఉద్యోగాలు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంటి నుంటే ఏదైనా చేయాలి అనుకునేవారికి కొన్ని మంచి ఆదాయ మార్గాలు మాత్రం ఉన్నాయి.
డేకేర్ సెంటర్:నగరాల్లో జీవితం ఉరుకులు పరుగులుగా ఉంటుందని మనందరికీ తెలుసు. చాలా పనులు సొంతంగా చేసుకోవాలని అనిపించినప్పటికీ అందుకోసం వెచ్చించటానికి సమయం ఉండదు. ఈ క్రమంలో చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉంటూ చిన్న పిల్లల సంరక్షణ కోసం ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు. ఇంటి వద్దే ఉండే గృహిణులు ఈ అవకాశాన్ని వ్యాపారంగా మలుచుకునేందుకు ఒక డేకేర్ సెంటర్ ప్రారంభించవచ్చు. ఇలా చేయటం వల్ల పిల్లలతో సమయం గడుపుతూ మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

క్లౌడ్ కిచెన్:నగరాల్లో చాలా మందికి ఇంటి ఆహారం తినాలని ఉంటుంది. ఎప్పుడూ బోరింగ్ బిరియానీలు, మసాలాలతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలనుకునే భోజన ప్రియులకు ఇంటి ఆహారాన్ని రుచి చూపిస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇటీవలి కాలంలో ఇలాంటి కల్చర్ పెరిగింది. ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో సైతం ఇంటి రుచులను అందిస్తామని ప్రకటన చేసింది. ఈ క్రమంలో మీరు కూడా సదరు సంస్థలతో భాగస్వాములుగా మారటం ద్వారా ఇంటి నుంచే పనిచేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
ఫ్రీలాన్సింగ్ జాబ్: ఆఫీసులకు వెళ్లి పనిచేయటం ఇష్టం లేని వారికి ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని ఫ్రీలాన్సింగ్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, యాప్ డెవలప్మెంట్, కోడింగ్ ఆసక్తి కలిగినవారికి మంచి అవకాశాలే ఉన్నాయి. వీటి నుంచి ఆదాయం భారీగానే ఉంటుంది.

బ్యూటీ పార్లర్లు: ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా తమ డబ్బును వెచ్చిస్తున్న దానిలో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ముందంజలో ఉన్నాయి. పెద్ద పెద్ద సెలూన్లకు వెళ్లలేని చాలా మందికి తక్కువ ధరలో ఆ సేవలను అందించటం ద్వారా ఉపాధి అవకాశాన్ని పొందవచ్చు. మీ సేవలు నచ్చినట్లయితే ఎలాంటి అడ్వర్టైజింగ్ లేకుండానే ఎక్కువమంది క్లైంట్లను పొందవచ్చు. ఇలా నగరాల్లోని మహిళలకు ఇంటి వద్ద నుంచే సంపాదించుకునేందుకు అనేక వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇలా చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ వాటి నుంచి పెద్ద ఆదాయం పొందటానికి అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications