Business Ideas: ఎక్కడైనా రైతులు కోట్లు సంపాదిస్తారా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే బ్యాంక్ ఉద్యోగం మానేసి రైతుగా మారిన అమిత్ కిషన్ దీనిని సాధించి చూపించారు.
అమిత్ కిషన్ బెంగళూరులోని ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్‌లో క్లెయిమ్ విభాగంలో సుమారు 8 ఏళ్ల పాటు పనిచేశాడు. ఈ క్రమంలో ఎక్కువగా క్యాన్సర్ సంబంధిత కేసులను గమనించాడు. వీటికి జీవశైలి, కలుషితమైన ఆహారం వంటి కారణాలుగా ఉన్నట్లు తన పరిశోధనలో తెలుసుకున్నాడు. మనం తినే తిండి, జీవించే జీవనమే ఈ దుస్థితికి కారణమని గ్రహించి 2019లో ఉద్యోగం మానేసి పూర్వీకుల మార్గంలో సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

అలా సేంద్రియ సాగువైపు అడుగులు వేసిన అమిత్ కిషన్ ప్రస్తుతం దాని నుంచి ఏడాదికి రూ.21 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. 2019లో అమిత్ కిషన్ తన సోదరుడు అశ్రిత్‌తో కలిసి రూ.1.5 కోట్ల రుణంతో హెబ్బేవు ఫామ్స్‌ను స్థాపించాడు. అప్పట్లో వీరికి 15 ఎకరాల భూమి ఉండడంతో.. అందులో సేంద్రియ పద్ధతుల్లో ఎలా వ్యవసాయం చేయాలనేదానిపై కొంత కాలం గడిపి మెళకువలు నేర్చుకున్నాడు.
గడచిన ఐదేళ్లలో అమిత్ దాదాపు 700 ఆవులు, గేదెలను నిర్వహిస్తున్నాడు. ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యాలు వంటి 40కి పైగా ఉత్పత్తులను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నాడు. అలా పాల ఉత్పత్తులతో పాటు వంటనూనెలను తయారు చేసి విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో రోజుకు 6 టన్నుల కూరగాయలు, 1500 లీటర్ల పాలను విక్రయిస్తున్నాడు. అలాగే 15 ఎకరాల నుంచి ప్రారంభమైన వ్యవసాయాన్ని 650 ఎకరాలకు విస్తరించి విజయవంతంగా నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నాడు. దేశవ్యాప్తంగా రైతులు సైతం ఇలాంటి మార్గాల ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications