ఛార్జీల్లేకుండా నగదు విత్‌డ్రా, ఇన్సురెన్స్: వారికి సురక్ష శాలరీ అకౌంట్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(MSME) కోసం ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సురక్ష శాలరీ అకౌంట్‌ను తీసుకు వచ్చింది. ఈ ఖాతాదారులకు హాస్పిక్యాష్ ఇన్సురెన్స్‌తో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా ప్రయోజానాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలో ఎంఎస్ఎంఈ రంగంలో 6 కోట్లకు పైగా సంస్థలు ఉన్నాయి. దేశ జీడీపీలో వీటి వాటా 29 శాతం.

అందుకే సురక్ష శాలరీ ఖాతా
ఈ రంగంలోని సంస్థలు పెద్ద సంఖ్యలో అనధికారిక శ్రామిక శక్తిని వినియోగించుకుంటున్నాయని, వీరికి సామాజిక, ఆర్థిక రక్షణ ప్రయోజాలు శాలరీతో పాటు లభించడం లేదని, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఆర్థిక రక్షణ లేదని, ఇది ఇబ్బందులకు గురి చేస్తోందని, ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం సురక్ష శాలరీ ఖాతాను తీసుకు వచ్చినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకుతెలిపింది.

ఖాతా ప్రత్యేకతలు
ఈ ఖాతాలకు కనీస నిల్వ పరిమితి లేదు. ఖాతాదారులు దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల బ్యాంకు కేంద్రాల వద్ద నగదు విత్ డ్రా చేసుకోవచ్చునని తెలిపింది ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు. ఈ బ్యాంకు కేంద్రాల వద్ద రూ.50వేల వరకు విత్ డ్రా, రూ.20వేల వరకు డిపాజిట్ పైన ఎలాంటి చార్జీలు లేవు. బదలీలు కూడా చేసుకోవచ్చు. హాస్పిక్యాష్ కవరేజీలో భాగంగా ఖాతాదారు ఏదైనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే రోజుకు రూ.400 చొప్పున గరిష్టంగా రూ.10 రోజుల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

నగదు రహిత చెల్లింపు, బీమా
ఈ వినూత్న ఖాతా ద్వారా ఎంఎస్ఎంఈలు, ఇతర సంస్థలు నగదు రహిత చెల్లింపులు చేయడంతో పాటు తమ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే అవకాశం ఉందని ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్స్ తెలిపింది. దేశంలో బీమాకు ప్రస్తుతం తక్కువ ప్రాధాన్యం ఉందని, ఈ నేపథ్యంలో ఈ ఖాతా ద్వారా ఆసుపత్రి బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ చేస్తున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications