పాలు, పెరుగు లేదా కూరగాయలు ఆర్డర్ చేస్తే కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటి తలుపు తట్టే జెప్టో (Zepto) గురించి మీకు తెలిసే ఉంటుంది. 19 ఏళ్ల వయసున్న ఇద్దరు కుర్రాళ్ళు.. ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా మొదలుపెట్టిన ఈ స్టార్టప్.. ఇప్పుడు భారతీయ స్టాక్ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అవును.. త్వరలోనే Zepto IPO రాబోతోంది! సుమారు 4,500 కోట్ల రూపాయల నిధులను సేకరించడమే లక్ష్యంగా ఈ కంపెనీ అడుగులు వేస్తోంది.

కాన్ఫిడెన్షియల్ రూట్ లో..
సాధారణంగా ఏదైనా కంపెనీ IPO కి రావాలంటే సెబీ (SEBI) కి అన్ని వివరాలు బహిరంగంగా సమర్పించాలి. కానీ Zepto 'గోప్యమైన మార్గం' (Confidential Filing) ఎంచుకుంటోంది. అంటే.. కంపెనీ ఆర్థిక వివరాలు, ఇతర కీలక సమాచారం వెంటనే అందరికీ తెలియవు. ప్రక్రియ ముగిసే దశలో మాత్రమే వీటిని వెల్లడిస్తారు. టాటా మోటార్స్ వంటి పెద్ద కంపెనీలు కూడా గతంలో ఇదే పద్ధతిని అనుసరించాయి.
ఆదాయం ఓకే.. కానీ లాభాల మాటేంటి?
వ్యాపార పరంగా Zepto జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఏకంగా రూ. 11,110 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఇది మునుపటి ఏడాది కంటే 150% ఎక్కువ! అయితే క్విక్ కామర్స్ రంగంలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీ ఇంకా లాభాల్లోకి రాలేదు. కానీ తన నష్టాలను సగానికి తగ్గించుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం Zepto మార్కెట్ విలువ సుమారు 7 బిలియన్ డాలర్లు (రూ. 58,000 కోట్లకు పైగా) ఉండటం విశేషం.
IPO నిధులతో ఏం చేయబోతున్నారు?
Zepto IPO ద్వారా వచ్చే డబ్బుతో కంపెనీ తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలనుకుంటోంది. ప్రస్తుతం ఉన్న 1,000 కి పైగా డార్క్ స్టోర్లను వచ్చే ఐదు నెలల్లో మరింత పెంచాలని చూస్తోంది. డెలివరీని మరింత వేగవంతం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పెట్టుబడులు పెట్టనుంది. అలాగే తమ సేవలను కేవలం మెట్రో నగరాలకే పరిమితం టైర్ 2 నగరాలకు కూడా విస్తరించబోతోంది.
దిగ్గజాలతో పోరాటం!
క్విక్ కామర్స్ మార్కెట్ ఇప్పుడు ఒక 'కురుక్షేత్రం'లా మారింది. ఒకవైపు Blinkit, మరోవైపు Swiggy Instamart, టాటా BigBasket.. వీటికి తోడు ఇప్పుడు Amazon కూడా ఈ రేసులోకి వస్తోంది. ఈ భారీ పోటీని తట్టుకుని నిలబడాలంటే భారీగా నిధులు అవసరం. అందుకే Zepto ఈ IPO ప్లాన్ చేస్తోంది.
ఈ IPO కి సంబంధించి యాక్సిస్ బ్యాంక్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాక్స్ వంటి పెద్ద పెద్ద సంస్థలు సలహాదారులుగా వ్యవహరిస్తున్నాయి. వచ్చే వారమే దీనికి సంబంధించిన పత్రాలు సెబీకి అందజేసే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
Zepto IPO వార్తలు వినగానే ఇన్వెస్టర్లలో ఒక రకమైన ఉత్సాహం రావడం సహజం. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ప్రస్తుతం క్విక్ కామర్స్ రంగంలో విపరీతమైన పోటీ ఉంది. బ్లింకిట్ (Blinkit) ఇప్పటికే లాభాల దిశగా పయనిస్తుండగా.. స్విగ్గీ (Swiggy) ఇటీవలే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు జెప్టో కూడా వస్తోంది. ఇన్వెస్టర్లు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే.. కంపెనీ ఆదాయం పెరుగుతున్నా, నష్టాలు (Net Loss) ఎంత వేగంగా తగ్గుతున్నాయి అనే అంశం.
జెప్టో ప్లాన్ చేస్తున్న 'కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్' వల్ల పూర్తి వివరాలు ఇప్పుడే బయటకు రావు. కాబట్టి, సెబీ నుంచి అనుమతి వచ్చి, కంపెనీ తమ వివరాలు విడుదల చేసే వరకు వేచి చూడటం ఉత్తమం. ఆ పత్రాల్లో కంపెనీ అప్పులు, లాభనష్టాలు, భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా వివరిస్తారు. క్విక్ కామర్స్ అనేది భవిష్యత్తు ఉన్న రంగం కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది ఒక మంచి అవకాశం కావచ్చు, కానీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి అడుగు వేయాలి.


Click it and Unblock the Notifications