రూపాయి కూడా నగదు రూపంలో మీ దగ్గర ఉంచుకోవద్దు.. యుద్ధం వచ్చినా వీటిల్లో పెట్టుబడి పెట్టాలంటున్న వారెన్ బఫెట్..
World War III and Stock Markets: ప్రపంచ యుద్ధం లాంటి భారీ భౌగోళిక రాజకీయ సంక్షోభం సంభవిస్తే ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురై తమ వద్ద ఉన్న స్టాక్‌లను విక్రయించి, నగదును (Cash) పట్టుకోవడానికి పరుగులు తీస్తుంటారు. కానీ ప్రపంచ ప్రసిద్ధ బిలియనీర్ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్‌వే మాజీ సీఈఓ వారెన్ బఫెట్ (Warren Buffett) ఆలోచనా విధానం ఇందుకు పూర్తిగా భిన్నం.
ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం మొదలైనా కూడా తాను స్టాక్‌లను విక్రయించబోనని.. పైగా కొత్తగా స్టాక్‌లను కొంటూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 2014లో సీఎన్‌బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన ఈ ఆసక్తికర పెట్టుబడి సూత్రాలు ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశమయ్యాయి.
సంక్షోభ సమయంలో డబ్బును నగదు రూపంలో బ్యాంకుల్లో దాచుకోవడమే అత్యంత సురక్షితమైన మార్గమని సాధారణ ప్రజలు భావిస్తారు. కానీ బఫెట్ దృష్టిలో యుద్ధ సమయంలో నగదును పట్టుకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరం. నాకు తెలిసినంత వరకు దాదాపు ప్రతి యుద్ధంలోనూ డబ్బు తన కొనుగోలు శక్తిని (Purchasing Power) కోల్పోతూనే వచ్చింది.

మనం ఏదైనా అతిపెద్ద యుద్ధంలోకి వెళితే.. ద్రవ్యోల్బణం పెరిగి డబ్బు విలువ పడిపోతుందనే విషయంలో సందేహం లేదని బఫెట్ పేర్కొన్నారు. ఖాతాలో ఉన్న డబ్బు సంఖ్య మారకపోయినప్పటికీ.. ఆ డబ్బుతో మునుపటి కంటే తక్కువ వస్తువులను మాత్రమే కొనగలిగే పరిస్థితి (Hyperinflation) ఏర్పడుతుందని తెలిపారు.
నగదు కంటే 'ఉత్పాదక ఆస్తులను' సొంతం చేసుకోవడమే ఇన్వెస్టర్లను రక్షిస్తుందని బఫెట్ నమ్ముతారు. యుద్ధం లేదా ఏ విధమైన తీవ్రమైన ప్రతికూల పరిస్థితి ఎదురైనా మానవ నాగరికత మనుగడ సాగిస్తూనే ఉంటుంది. అందుకే వ్యాపారాలను (స్టాక్స్ ద్వారా), వ్యవసాయ భూములను (Farmlands), అపార్ట్‌మెంట్ భవనాలను కలిగి ఉండటానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. వ్యవసాయ క్షేత్రాలు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అపార్ట్‌మెంట్లు నివాస వసతిని కల్పిస్తాయి, వ్యాపారాలు సేవలను అందిస్తాయి. కాబట్టి కాలక్రమేణా ఇవే నిజమైన ఆర్థిక విలువను సృష్టిస్తాయి.
చరిత్రను పరిశీలిస్తే బఫెట్ వ్యయజమాన్యానికి తగిన ఆధారాలు కనిపిస్తాయి. 1941 డిసెంబర్ 7న జపాన్ పెర్ల్ హార్బర్‌పై దాడి చేసిన తర్వాత తదుపరి ఐదు నెలల్లో S&P 500 సూచీ సుమారు 17 శాతం పడిపోయింది. అయితే 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి, అదే S&P 500 సూచీ దాడి జరిగిన రోజు నాటి స్థాయి నుండి ఏకంగా 62 శాతం లాభాలను నమోదు చేసింది. సంక్షోభం ఆరంభంలో మార్కెట్లు పడిపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో మానవ ఉత్పాదకత, కంపెనీల పునరుద్ధరణ కారణంగా మార్కెట్లు ఊహించని రీతిలో కోలుకుంటాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
ఆయన చెప్పిన విషయం సారాంశంగా చెప్పాలంటే.. ప్రపంచ యుద్ధం లాంటి విపత్తులు ఎదురైనప్పుడు అనిశ్చితి రాజ్యమేలుతుంది, నష్టాలు సంభవించవచ్చు. కానీ డబ్బును కేవలం నగదు రూపంలో ఉంచుకోవడం కంటే.. సమాజానికి నిరంతరం ఉపయోగపడే ఉత్పాదక ఆస్తులు, నాణ్యమైన కంపెనీల షేర్లలో దీర్ఘకాలికంగా పెట్టుబడి ఉంచడమే సంపదను కాపాడుకోవడానికి అత్యుత్తమ మార్గమని వారెన్ బఫెట్ నిరూపించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
