మూడు నెలల్లో రూ. 30 వేల కోట్లు ఢమాల్.. ఈ స్టాక్ కొనాలంటే భయపడుతున్న ఇన్వెస్టర్లు.. ఎందుకంటే..
గత రెండేళ్లలో భారతీయ స్టాక్ మార్కెట్‌లో అసాధారణ ర్యాలీతో ఇన్వెస్టర్లకు మల్టీబేగర్ రిటర్న్లు అందించిన బీఎస్ఈ లిమిటెడ్ (BSE Ltd) షేరు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత మూడు నెలల వ్యవధిలోనే బిఎస్‌ఈ దాదాపు రూ. 30 వేల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయి పెట్టుబడిదారుల సహనానికి పరీక్ష పెడుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS), డెరివేటివ్స్ విభాగంలో క్షీణిస్తున్న ఇండెక్స్ ఆప్షన్స్ వాల్యూమ్‌లు, బ్రోకర్ల కోసం ఆర్‌బిఐ, సెబీ కఠినతరం చేసిన బ్యాంక్ గ్యారెంటీ నిబంధనలు ఒకేసారి బిఎస్‌ఈ వ్యాపార రూపురేఖలను దెబ్బతీయడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి.
ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బ్రోకరేజ్ సంస్థలైన జెఫరీస్, నువామాలు బిఎస్‌ఈ స్టాక్‌పై తమ రాబోయే ఆర్థిక సంవత్సరాల ఆదాయ అంచనాలను తగ్గించడంతో పాటు షేరు రేటింగ్‌ను కూడా కుదించాయి. డెరివేటివ్స్ మార్కెట్‌లో సెన్సెక్స్ ఆప్షన్స్ నిరంతర వృద్ధి ఆధారంగానే బిఎస్‌ఈ వాల్యుయేషన్ గతంలో ఆకాశాన్నంటిందని.. అయితే ఇప్పుడు ఆ వృద్ధి అంచనాలు ప్రశ్నార్థకంగా మారడంతో స్టాక్‌పై తీవ్ర కొనుగోలు ఒత్తిడి నెలకొందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

మార్కెట్ ముగింపు ధరల్లో అవకతవకలను అరికట్టడానికి సెబీ శాశ్వతంగా తీసుకువచ్చిన కొత్త క్లోజింగ్ ఆక్షన్ విధానం ఎక్స్‌పైరీ రోజున ట్రేడర్ల ప్రవర్తనను పూర్తిగా మార్చేసింది. గతంలో ఆప్షన్ ప్రీమియంలు గడువు ముగిసే సమయానికి ఊహించదగిన రీతిలో క్షీణించడం వల్ల స్వల్పకాలిక ట్రేడర్లు పదేపదే పొజిషన్లలోకి ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి వీలయ్యేది. కానీ సిఎఎస్ అమలుతో ముగింపు ధర వేలం ఆధారంగా నిర్ణయించబడుతుండటంతో తుది సెటిల్‌మెంట్‌లో అనిశ్చితి పెరిగింది. ఇది థీటా-హార్వెస్టింగ్ వ్యూహాలను బలహీనపరిచి, ట్రేడర్ల లీవరేజ్‌ను తగ్గించి వేసింది.
ఈ పరిణామం బిఎస్‌ఈ వ్యాపారానికి భారీ నష్టాన్ని చేకూర్చింది. ఎందుకంటే బిఎస్‌ఈ డెరివేటివ్స్ రాబడిలో మెజారిటీ భాగం గడువు ముగిసే రోజు (Expiry Day) జరిగే ట్రేడింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. జూలై నెలలో బిఎస్‌ఈ డెరివేటివ్ కాంట్రాక్టులలో 72.6% కేవలం గడువు ముగిసే రోజువే కావడం గమనార్హం.
నువామా నివేదిక ప్రకారం.. సాధారణ రోజుల్లో బిఎస్‌ఈ కాంట్రాక్టులు 23.6 శాతం తగ్గితే, గడువు ముగిసే రోజున కాంట్రాక్టులు ఏకంగా 33.2 శాతం పడిపోయాయి. బిఎస్‌ఈ సగటు రోజువారీ ప్రీమియం టర్నోవర్ వారం వ్యవధిలోనే 22.7 శాతం తగ్గి రూ. 181 బిలియన్లకు పడిపోయింది. ఇది జనవరి 2025 తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయిగా చెప్పుకోవచ్చు. జూలైతో పోలిస్తే ఆగస్టులో కాంట్రాక్టుల సంఖ్య 150 మిలియన్ల నుండి 104 మిలియన్లకు (30.5%) క్షీణించింది.
ఇది కాకుండా, బ్రోకర్లకు బ్యాంక్ గ్యారెంటీ నిబంధనలను కఠినతరం చేస్తూ ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయం హై-ఫ్రీక్వెన్సీ ట్రేడర్ల మూలధన అవసరాలను పెంచి వేసింది. దీనివల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం టర్నోవర్ మరో 10 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని జెఫరీస్ హెచ్చరించింది. ఈ ఒత్తిడిని అధిగమించడానికి బిఎస్‌ఈ తన ఆప్షన్ ఫీజులను లేదా కో-లొకేషన్ మెసేజింగ్ ఫీజులను పెంచే అవకాశం ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్లు వాల్యూమ్ ఆధారిత వృద్ధికి ఇచ్చే ప్రాధాన్యతను ఫీజుల పెంపు భర్తీ చేయలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాల క్రమంలో జెఫరీస్ సంస్థ బిఎస్‌ఈ రేటింగ్‌ను 'అండర్‌పెర్ఫార్మ్'కు తగ్గిస్తూ, దాని టార్గెట్ ధరను రూ. 3,520 నుండి రూ. 2,940కి తగ్గించింది. అలాగే నువామా కూడా తన రేటింగ్‌ను 'హోల్డ్'కు కుదించి, లక్ష్య ధరను రూ. 3,240కి సవరించింది. అయితే బిఎస్‌ఈని కవర్ చేస్తున్న 18 మంది విశ్లేషకులలో సగానికి పైగా ఇప్పటికీ సుదీర్ఘ కాలానికి సానుకూల ధోరణినే వ్యక్తం చేస్తుండటం, సిఎఎస్ విధానానికి మార్కెట్ వేగంగా అలవాటుపడితే వాల్యూమ్‌లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని భావించడం ఇన్వెస్టర్లకు ఏకైక ఊరటనిచ్చే అంశం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
