IPO News: ఐపీవో చరిత్రలో రికార్డులు బద్దలు.. గ్రేమార్కెట్ ధర షేరుకు రూ.1,560..!!
Waaree Energies IPO: భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు వస్తుంటాయ్ పోతుంటాయ్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కంపెనీ ఐపీవో మాత్రం అడుగుపెట్టడానికి ముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసీ, టాటా టెక్నాలజీస్ ఐపీవోల రికార్డును ఈ ఐపీవో బద్దలు కొట్టింది. వివరాలను పరిశీలిస్తే..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వారీ ఎనర్జీస్ కంపెనీ ఐపీవో గురించే. ఐపీవో చివరి రోజున 76 కంటే ఎక్కువ సార్లు సభ్యత్వాన్ని పొందింది. తాజాగా పెట్టుబడిదారుల నుంచి షేర్ల కోసం అత్యధిక దరఖాస్తులు అందుకుని గత ఐపీవోల రికార్డులను తిరగరాసింది. వాస్తవానికి ఐపీవో ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం సోమవారం తెరవబడింది. నిన్నటితో ఆఫర్ క్లోజ్ అయిన మెయిన్ బోర్డ్ ఐపీవో రూ.4,321.44 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ కోసం 50 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం షేర్లను కేటాయించింది. ఇదే క్రమంలో కంపెనీ ఉద్యోగులకు 650 మిలియన్ షేర్లను రిజర్వు చేసింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ ఐపీవో ఇష్యూలో షేర్ల కోసం 97.34 లక్షల దరఖాస్తులను అందుకుని సరికొత్త రికార్డులను లిఖించింది. మెయిన్ కేటగిరీలో లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవో రూ.3,600 కోట్ల ఫ్రెష్ ఇష్యూ కోసం 2.4 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తుండగా.. మిగిలిన రూ.721.44 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ కోసం ఉంచింది. దీంతో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ కోసం రాబోతున్నాయి. అలాగే కంపెనీ షేర్లు అక్టోబర్ 28న మార్కెట్లో జాబితా కోసం వస్తున్నాయని తెలుస్తోంది.
ఐపీవో కోసం వారీ ఎనర్జీస్ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.1427 నుంచి రూ.1503గా నిర్ణయించింది. ఇదే క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 9 షేర్లుగా నిర్ణయించటంతో కనీసం ఒక లాట్ కొనుగోలు చేయటానికి ఇన్వెస్టర్లు రూ.13,527 వెచ్చించారు. ఇక తాజా గ్రేమార్కెట్ ప్రీమియం పరిశీలిస్తే.. నేడు ఒక్కో షేరుకు రూ.1560కి చేరుకుంది. ఇదే ధర లిస్టింగ్ తేదీ వరకు కొనసాగితే మార్కెట్లోకి ఒక్కో షేరు రూ.3063 రేటు వద్ద బంపర్ ఎంట్రీ ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు కంపెనీ షేర్ల అలాట్మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది. అంటే గ్రేమార్కెట్ ప్రీమియం ప్రకారం ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో షేర్ల లిస్టింగ్ జరిగితే తొలిరోజే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై దాదాపు 103.79 శాతం రాబడిని అందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications