This Week IPO's: ఇన్వెస్టర్లకు పండుగే.. ఈ వారం రాబోతున్న 3 ఐపీఓలు ఇవే..
ఐపీఓల కోసం ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు శుభవార్త. ఈ వారం మార్కెట్లోకి మూడు ఐపీఓలు రానున్నాయి. గత కొద్ది కాలంగా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఓలు ఎక్కువగా రాలేదు. అయితే అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో ఐపీఓలు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ వారం వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీఓ (Waterways Leisure Tourism IPO), అద్విత్ జ్యువెలర్స్ ఐపీఓ (Advit Jewels IPO), సీఎస్‌ఎమ్ టెక్నాలజీస్ ఐపీఓ (CSM Technologies IPO) సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి.

వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీఓ
వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీఓ సైజ్ రూ.585 కోట్లుగా ఉంది. సబ్స్క్రిప్షన్ జూన్ 23 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 25న ముగుస్తుంది. షేర్ల కేటాయింపు జూన్ 29న ఉండగా.. రీఫండ్ తో పాటు షేర్ల క్రేడిట్ 30 తేదీన జరుగుతుంది. జూలై 1న వాటర్‌వేస్ లీజర్ టూరిజం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయి. ఒక్కో షేరు ధరను రూ.769 నుంచి రూ.808 గా నిర్ణయించారు. రిటైల్ పెట్టుబడిదారులు ఈ ఐపీఓలో కనీసం రూ.14,544 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక లాట్ లో 18 షేర్లు ఉంటాయి. కాగా ఈ కంపెనీ దేశీయ ఓషన్ క్రూయిజ్ (సముద్ర విహారయాత్రల) రంగంలో పనిచేస్తోంది.
అద్విత్ జ్యువెలర్స్ ఐపీఓ
అద్విత్ జ్యువెలర్స్ ఐపీఓ సైజ్ రూ.165.16 కోట్లుగా ఉంది. ఇది చిన్న సైజ్ ఐపీఓ. సబ్స్క్రిప్షన్ జూన్ 23న ప్రారంభం అయి.. 25న ముగుస్తుంది. జూన్ 29 షేర్ల కేటాయింపు ఉండగా.. రీఫండ్, షేర్ల జమ జూన్ 30న జరుగుతుంది. జూలై 1న అద్విత్ జ్యువెలర్స్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నాయి. కాగా ఒక్కో షేరు ధరను రూ.130 నుంచి రూ.138 గా నిర్ణయించారు. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే కనీసం ఒక లాట్ అయిన కొనుగోలు చేయాలి. ఒక్క లాట్ కు రూ. 13,800 పెట్టుబడి పెట్టాలి. ఒక లాట్ లో 100 షేర్లు ఉంటాయి. ఇది జ్యువెలర్స్ కంపెనీ కాబట్టి మిగతా కంపెనీల లాగానే ఆభరణాలను విక్రయిస్తోంది.
సీఎస్‌ఎమ్ టెక్నాలజీస్ ఐపీఓ
సీఎస్‌ఎమ్ టెక్నాలజీస్ ఐపీఓ సైజ్ రూ.145.78 కోట్లుగా ఉంది. సబ్స్క్రిప్షన్ జూన్ 24న ప్రారంభమై.. జూన్ 29న ముగుస్తుంది. జూన్ 30న షేర్లు కేటాయిస్తారు. జులై 1న రీఫండ్, షేర్ల జమ ఉంటుంది. జూలై 2న సీఎస్‌ఎమ్ టెక్నాలజీస్ షేర్లు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయి. కాగా ఒక్కో షేరు ధరను రూ.107 నుంచి రూ.113 గా నిర్ణయించారు. పెట్టుబడిదారులు కనీసం రూ.14,916 పెట్టుబడి పెట్టాలి. ఒక లాట్ లో 132 షేర్లు వస్తాయి. సీఎస్‌ఎమ్ టెక్నాలజీస్ కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్ రంగంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications