Mahanadi Coalfields IPO: మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓ ప్రారంభం.. దరఖాస్తు చేసుకోవాలా..!
ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓ గురువారం ఓపెన్ అయింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.8,981.12 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఒక్కో షేరుకు రూ.129 నుంచి రూ.136 వరకు ధరల శ్రేణిని నిర్ణయించింది. భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన MCLలో వాటాను పొందే అవకాశం ఈ ఐపీఓ ద్వారా పెట్టుబడిదారులకు లభిస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) దేశీయ బొగ్గు ఉత్పత్తిలో ఈ సంస్థ వాటా 21 శాతంగా ఉంది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ఉండనుంది.
ఇందులో విక్రయించే షేర్లు కోల్ ఇండియాకు చెందినవి, కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయం మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కి దక్కదు. ఈ ఐపీఓ నవంబర్ 19న ప్రారంభమై, నవంబర్ 23న ముగుస్తుంది. ఇది బుక్-బిల్ట్ ఇష్యూ. అంటే పెట్టుబడిదారులు నిర్ణీత ధరల శ్రేణిలో తమ బిడ్లను దాఖలు చేయవచ్చు. బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యాక తుది ధరను నిర్ణయిస్తారు. ఒక్కో షేరు ముఖ విలువ రూ.2గా ఉంది. ఈ ఐపీఓలో మొత్తం 661,836,300 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. పెట్టుబడిదారులు కనీసం 110 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ట ధర రూ.136 చొప్పున లెక్కిస్తే రిటైల్ పెట్టుబడిదారులకు ఒక లాట్ (lot) ధర రూ.14,960 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఈ ఇష్యూలో కొంత భాగాన్ని అర్హులైన ఉద్యోగుల కోసం, ఇప్పటికే కోల్ ఇండియాలో వాటాలు కలిగి ఉన్న వారి కోసం కేటాయించారు. ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.6 రాయితీ కూడా లభిస్తుంది. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లలో లిస్ట్ కానున్నాయి. పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే యాంకర్ బుక్ ద్వారా సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఈ ఐపీఓకు మంచి స్పందన లభించింది. నవంబర్ 18న 53 ఫండ్లకు ఒక్కో షేరును రూ.136 చొప్పున మొత్తం 16,87,68,255 షేర్లు కేటాయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రూ.2,295.2 కోట్లను సమీకరించింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) యాంకర్ కేటాయింపులో అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచింది. ఎల్ఐసీ దాదాపు రూ.568 కోట్ల విలువైన షేర్లు కేటాయించింది. నిప్పాన్ లైఫ్ ఇండియా ట్రస్టీ రూ.500 కోట్ల విలువైన షేర్లను పొందింది. వీటితో పాటు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్, మరికొన్ని దేశీయ బీమా, మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయి. 1992లో స్థాపించిన మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా ప్రధాన అనుబంధ సంస్థలలో ఒకటిగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications