తొలిసారి అప్పు చేసి మరీ పెట్టుబడి పెడుతున్న టీసీఎస్(TCS)! ఈ ప్లానింగ్ మామూలుగా లేదు!
భారతదేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఒక వ్యూహాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ-బేస్డ్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థగా అవతరించబోతోంది. దీనికోసం టెక్సాస్ పసిఫిక్ గ్రూప్(TPG) తో కలిసి జాయింట్ వెంచన్ ను (Joint Venture) ఏర్పాటు చేయబోతోంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సావరీన్ డేటా సెంటర్లను (Sovereign Data Centers) ఏర్పాటు చేసేవిధంగా టీసీఎస్ అడుగులు వేస్తుంది. దీనికై దాదాపు రూ. 58 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. TCS & TPG కంపెనీలు జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టనున్నాయి. TPG అనేది టెక్సాస్‌లోని ఒక అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ. ఈ సంస్థతో కలిసి టీసీఎస్ ఈ వారంలో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.
ఇదే మొదటిసారి..
చరిత్రలో టీసీఎస్ ఎప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టలేదు. చిన్న చిన్న పెట్టుబడులతో మల్టిపుల్ వెంచర్స్ రన్ చేస్తూ వచ్చింది. ఇంత పెద్ద స్థాయిలో ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ (TPG) నుండి నిధులు తీసుకోవడం, అప్పులు సేకరించడం టీసీఎస్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.
tcs లక్ష్యం ఇదే..
టీసీఎస్ రాబోయే 5 ఏళ్లలో 1.2 గిగావాట్ (GW) సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొత్తం డేటా సెంటర్ల సామర్థ్యం కూడా దాదాపు ఇంతే ఉండటం ఈ ప్రాజెక్టు స్థాయిని తెలియజేస్తుంది. ఈ డేటా సెంటర్లు కేవలం టాటా గ్రూప్ సంస్థలకే కాకుండా, ఇతర పెద్ద టెక్ కంపెనీలకు, భారతీయ సంస్థలకు, ప్రభుత్వ విభాగాలకు సేవలు అందిస్తాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడానికి ఐదారేళ్లు పడుతుంది. కానీ రెవెన్యూ మాత్రం వచ్చే రెండేళ్లలో ప్రారంభమవుతుందని అంచనా.
ఏఐ వైపుగా..
ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తున్న ఈ రోజుల్లో టీసీఎస్ కూడా ఏఐకు షిఫ్ట్ అవ్వబోతోంది. తమ కంపెనీల్లో ఏఐ- ఆధారిత సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. ఇందులో భాగంగా గతేడాది సుమారు 6,000 మందికి పైగా ఉద్యోగులను తగ్గించింది.
పోటీ పెరుగుతోంది
డేటా సెంటర్ల రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, ఎన్టీటీ గ్లోబల్ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్ కూడా ఈ రంగంలోకి ప్రవేశించడంతో రాబోయే ఏళ్లలో ఈ రంగంలో భారీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications