రెండు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా విడిపోయిన టాటామోటార్స్.. పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సింది ఇదే..
టాటా మోటార్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీమెర్జర్ (విభజన) ఈరోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇది భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థకు ఒక ముఖ్యమైన పునర్నిర్మాణ దశగా భావించబడుతోంది. ఈ చర్య ద్వారా కంపెనీ ప్రయాణీకుల వాహనాలు (TMPV), వాణిజ్య వాహనాలు (TMLCV) విభాగాలను రెండు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా విడదీసింది. అక్టోబర్ 14ను రికార్డ్ తేదీగా నిర్ణయించగా, ఆ రోజు నాటికి షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులు రెండింటిలోనూ ఒక్కొక్క షేరును పొందుతారు.
టాటా మోటార్స్ ఈ డీమెర్జర్ ద్వారా రెండు విభిన్న వ్యాపారాలకి స్పష్టమైన దిశ, మూల్యాంకనం (valuation clarity) ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. TMPVలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR), ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ప్రయాణీకుల వాహనాలు ఉంటాయి. TMLCV అయితే దేశీయ వాణిజ్య వాహన వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. ఇకపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPV), టాటా మోటార్స్ లిమిటెడ్ (TMLCV) అనే పేర్లతో ఇవి రెండు విడిగా లిస్టింగ్ అవుతాయి.

డీమెర్జర్ ప్రకటనల మధ్య Tata Motors షేర్లు వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్లలో పడిపోయాయి. సోమవారం 2.7% తగ్గి రూ. 660.90 వద్ద ముగిశాయి. ఈ కాలంలో స్టాక్ దాదాపు 7 శాతం నష్టపోయింది.
2025లో ఇప్పటివరకు మొత్తం 11 శాతం పడిపోవడం గమనార్హం. పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈ విభజన విలువను అన్‌లాక్ చేస్తుందా లేదా తాత్కాలిక అస్థిరతను పెంచుతుందా అని పరిశీలిస్తున్నారు. పెట్టుబడిదారులకు ప్రస్తుతం కొత్త లివరేజ్ పొజిషన్‌లను F&Oలో సృష్టించకుండా ఉండండని SAMCO సెక్యూరిటీస్ సూచించింది. ఎందుకంటే స్టాక్ కొత్త నిర్మాణానికి సర్దుబాటు అవుతోంది.
SBI సెక్యూరిటీస్ ప్రకారం, ఈ డీమెర్జర్ టాటా మోటార్స్ వ్యాపారాల విలువను స్పష్టంగా చూపిస్తుంది. JLR నుండి 87 శాతం ఆదాయం పొందుతున్న TMPV షేర్లు రూ. 285 నుండి రూ. 384 మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని అంచనా. అదేవిధంగా TMLCV షేర్లు రూ.320 నుండి రూ. 470 మధ్య లిస్టింగ్ కావచ్చని SBI సెక్యూరిటీస్ అంచనా వేసింది.
ఇదే సమయంలో Iveco Group NV అనే యూరోపియన్ వాణిజ్య వాహన సంస్థను TMLCV 3.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ ఒప్పందం కంపెనీ ఆదాయాలను మూడింతలు పెంచి, ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధన రంగాల్లో గ్లోబల్ ప్రెజెన్స్ ను విస్తరించనుంది. YES సెక్యూరిటీస్ ఈ విభజనను పెట్టుబడిదారులకు విలువను అన్‌లాక్ చేసే కీలక అవకాశంగా పేర్కొంది.
ఇక బొనాంజా రీసెర్చ్ విశ్లేషకురాలు ఖుషీ మిస్త్రీ మాట్లాడుతూ.. డీమెర్జర్ రెండు కంపెనీల వ్యాపార దృష్టిని బలపరుస్తుందని తెలిపారు.
సెప్టెంబర్‌లో జరిగిన సైబర్ దాడి JLR ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ అక్టోబర్ 8న తయారీ దశలవారీగా పునఃప్రారంభమైంది. ఈ ఘటన కారణంగా Q2FY26లో 24% వాల్యూమ్ నష్టం మరియు 17 శాతం రిటైల్ తగ్గుదల చోటుచేసుకుంది. అయితే క్రిస్మస్ తర్వాత ఉత్పత్తి పూర్తిగా పునరుద్ధరించబడుతుందని YES సెక్యూరిటీస్ అంచనా వేసింది.
డీమెర్జర్ తర్వాత పెట్టుబడిదారులు ప్రయాణీకుల వాహన వ్యాపారం (TMPV) లేదా వాణిజ్య వాహన వ్యాపారం (TMLCV) మీద ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టగలరు. ఈ మార్పు తర్వాత కొంతకాలం స్టాక్‌లో అస్థిరత ఉండవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో JLR రికవరీ, Iveco కొనుగోలు విజయంపై కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ఏది ఏమైనా టాటా మోటార్స్ ఈ డీమెర్జర్ ద్వారా విలువ సృష్టికి మార్గం వేస్తోంది. ఇది రాబోయే సంవత్సరాల్లో పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక లాభాలను అందించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications