ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఒక కీలక వ్యాపార నిర్ణయం తీసుకుంది. బైక్ టాక్సీ సర్వీస్ ద్వారా పేరుపొందిన రాపిడోలో తన వాటాను అమ్మేసింది. ఈ నిర్ణయంతో స్విగ్గీకి సుమారు రూ. 2,400 కోట్లు అందనున్నాయి. కంపెనీ బోర్డు ఇప్పటికే ఈ డీల్‌కి ఆమోదం తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి ఇచ్చిన సమాచారం ప్రకారం, స్విగ్గీ తన దగ్గర ఉన్న 10 ఈక్విటీ షేర్లతో పాటు 1.63 లక్షల సిరీస్ D కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్లను ప్రోసస్ అనుబంధ సంస్థ MIH ఇన్వెస్ట్‌మెంట్స్ వన్ కి విక్రయిస్తోంది. ఈ లావాదేవీ విలువ రూ. 1,968 కోట్లు. అదనంగా, మరో 35,958 ప్రిఫరెన్స్ షేర్లను వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్‌కి చెందిన సేతు AIF ట్రస్ట్ కు విక్రయిస్తుంది. దీని ద్వారా మరో రూ. 431.5 కోట్లు వస్తాయి. మొత్తం కలిపి స్విగ్గీకి దాదాపు రూ. 2,400 కోట్లు లాభం.
2022లో స్విగ్గీ రాపిడోలో 180 మిలియన్లు డాలర్లు (సుమారు రూ. 1,400 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఆ సమయంలో రాపిడో విలువ 800 మిలియన్లు డాలర్లు. దీని వల్ల రాపిడో కెప్టెన్లకు (డ్రైవర్లు) అదనపు ఆదాయం వస్తుందని, డెలివరీ ఫ్లీట్ బలోపేతం అవుతుందని భావించారు. చిన్న పట్టణాల్లో రాపిడో స్థిరపడటానికి కూడా స్విగ్గీ సహకరించింది. అయితే 2025కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. రాపిడో తన సొంత ఫుడ్ డెలివరీ యాప్ ఓన్లీని ప్రారంభించింది.

ఇది Swiggy ప్రధాన వ్యాపారానికి నేరుగా పోటీగా మారింది. ఈ నేపథ్యంలో స్విగ్గీ సీఈఓ హర్ష్ మజెటీ మాట్లాడుతూ.. మేము రాపిడోలో పెట్టుబడి పెట్టినప్పుడు అది పూర్తిగా మొబిలిటీ కంపెనీ. కానీ వారు ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి రావడం వల్ల నేరుగా మా బిజినెస్‌తో సంఘర్షణ మొదలైంది. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
ఇక రాపిడో విషయానికి వస్తే, కంపెనీ త్వరలోనే భారీ స్థాయిలో నిధులు సేకరించబోతోంది. దాదాపు 500 నుంచి 550 మిలియన్లు డాలర్లే (రూ. 4,500 నుంచి 5,000 కోట్లు) ఫండింగ్ రాబోతోందని సమాచారం. ఇందులో కొత్త పెట్టుబడులు (primary) తో పాటు, పాత వాటాదారుల షేర్ల కొనుగోలు (secondary) కూడా ఉంటాయి. ఇది ఈ ఏడాది భారతదేశంలో ఒక స్టార్టప్ కోసం అతిపెద్ద ఫండింగ్ రౌండ్ కానుంది. రాపిడో ప్రస్తుతం తన బైక్ టాక్సీ మరియు ఆటో సర్వీసులను విస్తరిస్తూ, ఫుడ్ డెలివరీ సేవలపైనా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే "ఓన్లీ" ఫుడ్ యాప్‌కి డిమాండ్ పెరుగుతోంది
ఈ తాజా డీల్ తర్వాత రాపిడో విలువ 2.3 బిలియన్లు డాలర్లు (రూ. 20,300 కోట్లు)గా అంచనా వేయబడింది. కేవలం కొన్ని నెలల క్రితం, ఫిబ్రవరి 2025లో, ప్రోసస్ కంపెనీకి రూ. 30 మిలియన్లు పెట్టుబడి పెట్టినప్పుడు రాపిడో విలువ 1.1 బిలియన్లు డాలర్లు మాత్రమే. అంటే, కేవలం ఏడాదిలోపు రాపిడో విలువ రెట్టింపు అయింది.


Click it and Unblock the Notifications