గ్లోబల్ మార్కెట్ల జోష్.. దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మూడు రోజుల నష్టాలకు బ్రేక్..
భారత స్టాక్ మార్కెట్ నేడు సరికొత్త ఉత్సాహంతో ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు, చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్న అమెరికా-ఇరాన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే ఆశలు పెట్టుబడిదారులలో కొత్త నమ్మకాన్ని నింపాయి. వైట్ హౌస్ పూల్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొంటుందనే వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలను తగ్గించడమే కాకుండా, బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 105 డాలర్ల స్థాయికి దిగిరావడానికి కారణమైంది. క్రూడాయిల్ ధరలు తగ్గడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి ఎప్పుడూ కలిసొచ్చే అంశమే.
ఈ సానుకూల పవనాల నేపథ్యంలో ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వడమే భారీ లాభాలతో ఓపెన్ అయింది. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 627 పాయింట్లు లాభపడి 75,945 ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా, నిఫ్టీ కూడా 200 పాయింట్లు పెరిగి 23,859 మార్కును తాకింది. ఉదయం 10:00 గంటల సమయానికి నిఫ్టీ 50 సూచీ 151.30 పాయింట్లు లేదా 0.64 శాతం లాభంతో 23,808.25 వద్ద స్థిరంగా ట్రేడవుతుండగా, సెన్సెక్స్ 393.31 పాయింట్ల (0.52 శాతం) పెరుగుదలతో 75,719.36 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులను సూచించే 'ఇండియా విక్స్' (India VIX) కూడా 4 శాతం మేర క్షీణించి 18 స్థాయికి చేరడం ఇన్వెస్టర్ల భయాలను తగ్గించింది.

ఈ రోజు మార్కెట్లో కేవలం లార్జ్‌క్యాప్ షేర్లే కాకుండా.. విస్తృత మార్కెట్ అయిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగాలు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.62 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.95 శాతం లాభపడటం చూస్తుంటే, పెట్టుబడిదారులు మధ్యస్థ, చిన్న తరహా కంపెనీలలో కూడా భారీగా కొనుగోళ్లు జరుపుతున్నట్లు స్పష్టమవుతోంది. రంగాల వారీగా పరిశీలిస్తే.. రియల్టీ, సిమెంట్ రంగాలు మార్కెట్‌ను ముందుండి నడిపిస్తున్నాయి.
నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ గరిష్టంగా 1.5 శాతం లాభపడగా, సిమెంట్ రంగం 1 శాతం వృద్ధి చెందింది. వీటితో పాటు మీడియా, ఆటోమొబైల్, మెటల్ మరియు పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు కూడా గ్రీన్ జోన్‌లో ట్రేడవుతున్నాయి. అయితే, మరోవైపు ఐటీ రంగం మాత్రం స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొంటూ నిన్నటి ముగింపుతో పోలిస్తే స్వల్ప క్షీణతను చవిచూసింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్లుగా నిలవగా.. ఇన్ఫోసిస్, ట్రెంట్, సన్ ఫార్మా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇదిలావుండగా ఈరోజు మార్కెట్ గమనాన్ని మార్చగల మరొక ముఖ్యమైన అంశం కార్పొరేట్ కంపెనీల క్యూ4 (Q4) ఆర్థిక ఫలితాలు. నేడు దేశంలోని సుమారు 180కి పైగా ప్రముఖ కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇందులో దిగ్గజ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ ఐటీసీ (ITC), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), అరబిందో ఫార్మా, గెయిల్ ఇండియా, ఎమామీ, పేజ్ ఇండస్ట్రీస్, నైకా (Nykaa), మాక్స్ హెల్త్‌కేర్ వంటి కీలక కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీసీ ఫలితాలపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది; పొగాకు ఆకుల ధరలు పెరగడం వల్ల సిగరెట్ వ్యాపార మార్జిన్లపై ఒత్తిడి ఉండవచ్చని, అయినప్పటికీ ఎఫ్‌ఎమ్‌సీజీ రంగం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితాల ప్రకటనకు ముందే ఈ స్టాక్స్‌లో ట్రేడింగ్ వాల్యూమ్స్ భారీగా పెరిగాయి.
ఇక ప్రైమరీ మార్కెట్ వైపు చూస్తే, ఐపీఓ (IPO) సందడి కూడా గట్టిగానే కనిపిస్తోంది. నేటితో టీమ్ ఫార్మ్‌వర్క్ సొల్యూషన్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ గడువు ముగియనుంది. కాగా, వేగోరామ పంజాబీ అంగీతి, హరికాంత ఓవర్సీస్ ఐపీఓలు రెండో రోజుకు చేరాయి. ఇదే సమయంలో బయో మెడికా లాబొరేటరీస్, ఆటోఫర్నిష్ మరియు క్యూ-లైన్ బయోటెక్ ఐపీఓలు ఈరోజే సబ్‌స్క్రిప్షన్ కోసం కొత్తగా ప్రారంభమయ్యాయి. చిన్న మరియు మధ్య తరహా (SME) ఐపీఓలపై రిటైల్ ఇన్వెస్టర్లు ఇంకా తమ ఆసక్తిని కొనసాగిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లలో అమెరికా చిప్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) బలమైన ఆదాయాల ఫలితాలు కూడా ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా జపాన్, సౌత్ కొరియా మార్కెట్లకు బూస్ట్ ఇచ్చాయి. ఈ అంతర్జాతీయ సానుకూల వాతావరణం, దేశీయంగా కనిపిస్తున్న కొనుగోళ్ల మద్దతు చూస్తుంటే, నేడు భారత మార్కెట్లు లాభాల్లోనే ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
